Begin typing your search above and press return to search.

భారతీయులు బంగారాన్ని అమ్మేస్తున్నారా? తాజా రిపోర్టు ఏం చెప్పింది?

ఈ కొత్త అలవాటు కారణంగా దేశంలోని పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు భారీగా డిమాండ్ పెరిగినట్లుగా చెబుతున్నారు.

By:  Garuda Media   |   30 Jun 2026 9:00 PM IST
భారతీయులు బంగారాన్ని అమ్మేస్తున్నారా? తాజా రిపోర్టు ఏం చెప్పింది?
X

ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అందించిన గణాంకాల ప్రకారం భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత బంగరాన్ని గడిచిన మూడు (ఏప్రిల్ - జూన్) నెలల్లో భారీగా అమ్మేసిన కొత్త విషయం వెలుగు చూసింది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పడిపోతాయన్న భయం.. తమ వద్ద ఉన్న పాత బంగారు అభరణాల్ని అమ్మేసి నగదుగా మార్చేందుకు మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఐబీజేఏ అంచనా ప్రకారం గడిచిన మూడు నెల్లలో భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల (టన్ను అంటే వెయ్యి కేజీలు) పాత బంగారాన్ని అమ్మేసినట్లుగా పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇలా అమ్మే తీరు 43 శాతం పెరిగినట్లుగా లెక్కలు తేల్చారు. ఈ కొత్త అలవాటు కారణంగా దేశంలోని పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు భారీగా డిమాండ్ పెరిగినట్లుగా చెబుతున్నారు.

గత ఏడాదిలో పాత బంగారాన్ని రీసైకిల్డ్ చేసిన గణాంకాల్ని చూస్తే ఇది 125-150 టన్నులుగా ఉందని.. తాజా గణాంకాల్ని చూసినప్పుడు.. ఈ కొత్త ట్రెండ్ ఇదే రీతిలో కొనసాగితే ఈ ఏడాది 200-250 టన్నుల వరకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30వేల టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా ఒక అంచనా.

తాజా అలవాటు కారణంగా.. దేశీయంగా ఉన్న పాత బంగారం రీసైక్లింగ్ కావటం వల్ల పసిడి దిగుమతుల మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. బంగారం దిగుమతి తగ్గటంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్న మాట మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంతకూ ఇప్పుడు పాత బంగారాన్ని అమ్మేయటానికి కారణం లేకపోలేదంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో రికార్డు స్థాయిలో బంగారు ధరలు నమోదు కావటం తెలిసిందే.

ప్రస్తుతం పది గ్రాముల బంగారం రూ.1.44లక్షలుగా ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో ఇది కాస్తా పది గ్రాములు రూ.1.2 లక్షలకు తగ్గుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. దీంతో.. మధ్యతరగతి వారు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేయటం ద్వారా లాభంగా మార్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇళ్లల్లోనూ.. బ్యాంక్ లాకర్లలో ఊరికే ఉంచే పాత బంగారం ఇప్పుడు అధికారిక మార్కెట్ లోకి వస్తున్నట్లుగా కొన్ని సంస్థలు సైతం చెబుతుున్నాయి. ఈ కొత్త మార్పు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశీయంగా పాత బంగారం భారీగా మార్కెట్ లోకి వస్తే.. కొత్త బంగారం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసే భారం తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.