100 కోట్ల చదరపు అడుగులకు భారత ఆఫీస్ స్పేస్.. విలువ ఎంతంటే?
అవును.. భారతదేశం దూసుకెళుతోంది. గతానికి భిన్నంగా వివిధ రంగాల్లో తన దూకుడును ప్రదర్శిస్తోంది.
By: Garuda Media | 1 Nov 2025 2:00 PM ISTఅవును.. భారతదేశం దూసుకెళుతోంది. గతానికి భిన్నంగా వివిధ రంగాల్లో తన దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా సీఐఐ - నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత్ లోని ఆఫీస్ స్పేస్ లెక్కలు ఆసక్తికరంగా మారాయి. దేశంలోని మొత్తం ఆఫీస్ స్పేస్ 100 కోట్ల చదరపు అడుగులకు మించిపోయినట్లుగా తేల్చింది. ఈ మొత్తం ఆఫీస్ స్పేస్ విలువ ఏకంగా రూ.16.4 లక్షల కోట్లుగా అంచనా కట్టారు.
ప్రపంచంలో భారత్ నాలుగో అతి పెద్ద ఆఫీస్ మార్కెట్ గా ఎదిగిన విషయాన్ని వెల్లడించింది. పాతికేళ్ల వ్యవధిలో ఆఫీస్ స్పేస్ విషయంలో భారత్ దూకుడును గణాంకాలతో సహా వివరించింది, 2000లో 20 కోట్ల చదరపు అడుగుల స్థాయిలో ఉన్న దేశీయ ఆఫీస్ స్పేస్ పరిమాణం.. గడిచిన పాతికేళ్లలో ఐదింతలై వంద కోట్ల చదరపు అడుగుల స్థాయికి చేరినట్లుగా పేర్కొంది.
ఆఫీస్ స్పేస్ విభాగంలో అత్యంత వేగంగా పెరిగటమే కాదు.. భవిష్యత్ అవసరాలకు సంసిద్ధమైన మార్కెట్ గా భారత్ అవతరించినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఇదో అసాధారణ ఎదుగుదలగా పేర్కొనటమే కాదు.. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న లీజింగ్ అంశాల్ని ప్రస్తావించింది. ఈ ఏడాది గడిచిన తొమ్మిది నెలల్లో 6.7కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగినట్లుగా నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ నిర్మాణాత్మక శక్తికి ఈ గణాంకాలు నిదర్శనంగా చెబుతున్నారు. వంద కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కు రెట్టింపు 200 కోట్ల చదరపు అడుగుల మైలురాయిని త్వరలోనే భారత్ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది పరిమిత సరఫరా.. పెరుగుతున్న డిమాండ్.. డెవలపర్లలో జాగురూకత లాంటి అంశాల కారణంగా భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ కీలక మలుపు దశలో ఉన్నట్లుగా పేర్కొంది. మొత్తంగా భారత ఆర్థిక రంగం ఎలా ఉందన్న దానికి ఒక సానుకూల అంశంగా చెప్పొచ్చు.
