జేడీ వాన్స్ తీరుపై భారత్ ఆగ్రహం.. అమెరికాకు ఇచ్చిపడేసిన భారత్
భారతీయ నిపుణులు అమెరికాకు వెళ్లడం వల్ల కేవలం భారతీయ ఉద్యోగులకే కాకుండా.. అమెరికా కంపెనీలకు కూడా భారీగా లబ్ధి చేకూరుతోందని భారత్ వివరించింది.
By: A.N.Kumar | 9 Oct 2026 10:52 PM ISTఅమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ దేశ కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయాలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థలపై ఆంక్షలు విధించడం.. భారతీయ నిపుణుల వలసను ప్రతికూలంగా చిత్రీకరించడం ఇరు దేశాల ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్య ఆకాంక్షలకు విఘాతం కలిగిస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ నిరసన
హెచ్-1బీ వీసా విధానాన్ని వినియోగించుకునే కంపెనీలను ‘వీసా మిల్లులు’గా.. విదేశీ ఉద్యోగులను ‘ఒప్పంద పనివాళ్లు’గా సంబోధిస్తూ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భారత్ స్పందిస్తూ... తరతరాలుగా వలసదారుల శ్రమ, మేధస్సు, ఆవిష్కరణలే అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టాయని గుర్తుచేసింది. ఇటువంటి సమయంలో సామ్రాజ్యవాద భావనలు ప్రతిబింబించే పదజాలాన్ని ఉపయోగించడం ఏమాత్రం తగదని హితవు పలికింది.
ఇరు దేశాలకూ లాభదాయకమైన ప్రక్రియ
భారతీయ నిపుణులు అమెరికాకు వెళ్లడం వల్ల కేవలం భారతీయ ఉద్యోగులకే కాకుండా.. అమెరికా కంపెనీలకు కూడా భారీగా లబ్ధి చేకూరుతోందని భారత్ వివరించింది. అత్యున్నత నైపుణ్యం కలిగిన మన నిపుణులు అమెరికా సంస్థల్లో ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని.. ఇది ఆ దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా దోహదపడుతోందని పేర్కొంది. ఈ నైపుణ్యాల మార్పిడి పరస్పర ప్రయోజనకరమైనదని స్పష్టం చేసింది.
ఐటీ దిగ్గజాలపై పీఈఆర్ఎం సస్పెన్షన్ ప్రభావం
టాటా, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని వంటి ప్రముఖ ఐటీ సంస్థలను పెర్మ్ ప్రక్రియ నుంచి అమెరికా సస్పెండ్ చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణ ప్రభావం లేకున్నా ఈ చర్య వల్ల ప్రస్తుతం హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల వీసాలు రద్దు కావు. గ్రీన్‌కార్డు ఆలస్యం అయితే పర్మ్ ప్రక్రియ సస్పెన్షన్ కారణంగా సదరు కంపెనీల ద్వారా గ్రీన్‌కార్డు శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే నిపుణులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది.
అమెరికా స్వదేశీ ఉద్యోగాల రక్షణ పేరుతో తీసుకుంటున్న ఇటువంటి ఏకపక్ష చర్యలు ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక , సాంకేతిక సహకారాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
