స్పామ్, ఫ్రాడ్ కాల్స్ కు తెరపడినట్లేనా ?
ఇక నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద పేరు, మొబైల్ నంబర్ రెండూ కనిపిస్తాయి.
By: Garuda Media | 15 Oct 2026 4:03 PM ISTసెల్ ఫోన్ వినియోగదారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య స్పామ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్. ట్రూ కాలర్ ఇన్ స్టాల్ చేసుకున్నా, డు నాట్ డిస్ట్రబ్ లో నమోదు చేసుకున్నా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం పూర్తి స్థాయిలో లభించలేదు.
ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ తాజాగా టెలికాం ఆపరేటర్లకు జారీచేసిన ఉత్తర్వులతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న వాదన వినిపిస్తున్నది. నవంబర్ 1 నుండి కాలర్ నేమ్ డిస్ ప్లే (CNAP - Calling Name Presentation) తప్పనిసరి అవుతుంది.
ఇక నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద పేరు, మొబైల్ నంబర్ రెండూ కనిపిస్తాయి. మీ సెల్ ఫోన్ లో లేని నంబర్ నుండి ఫోన్ వస్తే కాల్ చేసిన వ్యక్తి టెలికాం ఆపరేటర్ వద్ద కేవైసీ, సబ్ స్క్రైబర్ రికార్డుల్లో ఉన్న రిజిస్టర్డ్ పేరు కనిపిస్తుంది. ఐఎస్డీ కాల్ అయితే ఇంటర్నేషనల్ కాల్ అని వస్తుంది. ఇది ఫోన్లో ఏం యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా ఆన్ అవుతుంది.
అయితే ఇందులో Calling Line Identification Restriction (CLIR) అప్షన్ ఉన్న వాళ్ల పేరు కనిపించదు. నవంబర్ 1 నుండి 4జి, 5జి వైర్ లెస్ నెట్ వర్క్ లలో తప్పనిసరిగా అమలు కానున్నది. 2జి, 3జి, ల్యాండ్ లైన్ ఫోన్లకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నారు.
తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను గుర్తించడం సులభతరం చేయడం, ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్ ల మీద ఆధార పడకుండా, అధికారిక కేవైసీ డాటా ఆధారంగా వెరిఫైడ్ పేరు చూయించడం జరుగుతుంది. ఇప్పటికే జియో, వీఐ టెలికాం సంస్థలు దీనిపై పైలట్ ట్రయల్స్ నిర్వహించాయి.
