Begin typing your search above and press return to search.

దేశంలో భారీగా పెరుగుతున్న మిలియనీర్లు.. ఎంతలా అంటే?

తాజాగా మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్టు 2025లో ఈ ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

By:  Garuda Media   |   20 Sept 2025 3:00 PM IST
దేశంలో భారీగా పెరుగుతున్న మిలియనీర్లు.. ఎంతలా అంటే?
X

దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. అది కూడా వేగంగా. ఎంతలా అంటే.. తాజాగా వెల్లడైన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇంతకూ మిలియనీర్ అని ఎవరిని అంటారు. వారికి ఉండాల్సిన ఆస్తుల విలువ ఎంత? అంటే.. రూ.8.5కోట్లు. అంత సంపద ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయి? నాలుగేళ్ల వ్యవధిలో ఇదెంత భారీగా పెరిగిందన్న విషయాన్ని చూస్తే.. సంపదను క్రియేట్ చేసే విషయంలో భారతీయుల దూకుడు ఇట్టే అర్థమవుతుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అధికారికంగానే ఎదుగుదల ఇంతలా ఉంటే.. అనధికారికంగా ఇదెంతలా ఉంటుందో అంచనాకు అందదనే చెప్పాలి.

తాజాగా మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్టు 2025లో ఈ ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దేశంలో మిలియనీర్ల కుటుంబాల సంఖ్య విపరీతమైన వేగంతో పెరుగుతోంది. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో మిలియనీర్ల కుటుంబాల సంఖ్య 4.58 లక్షలు కాగా.. గడిచిన నాలుగేళ్లలో అందుకు భిన్నంగా 8.71 లక్షలకు పైనే కుటుంబాలు మిలియనీర్లుగా మారారు. 2017 - 2025 మధ్య మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 445 శాతానికి పెరగటం విశేషంగా చెప్పాలి.

మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర నిలిస్తే.. టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ చోటు దక్కించుకోగా.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీకి మాత్రం చోటు దక్కలేదు. అదే సమయంలో దేశంలో అత్యధిక మిలియనీర్లు ఉన్న మహానగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి చోటు దక్కించుకుంది. మిలియనీర్ కుటుంబాలు అత్యధికంగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల విషయానికి వస్తే..

1. మహారాష్ట్ర

2. ఢిల్లీ

3. తమిళనాడు

4. కర్ణాటక

5. గుజరాత్

6. ఉత్తరప్రదేశ్

7. తెలంగాణ

8. పశ్చిమబెంగాల్

9. రాజస్థాన్

10. హర్యానా

మిలియనీర్ల సంఖ్యలో దూకుడు 2020 తర్వాతే పెరిగింది. 2019లో దేశంలో 3.39 లక్షల కుటుంబాలు ఉంటే.. 2020నాటికి 3.98 లక్షలకు చేరింది. 2022 తర్వాత నుంచి మిలియనీర్ల దూకుడు భారీగా పెరిగింది. 2022లో 5.37 లక్షలుగా ఉంటే.. ఆ తర్వాతి ఏడాది (2023)లో 6.31 లక్షలు.. 2024 నాటికి 7.41 లక్షలు.. 2025 నాటికి 8.71 లక్షలుగా చేరారు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే.. 8,71,700 కుటుంబాలుగా సర్వే వెల్లడించింది. కొవిడ్ తర్వాతనే తీసుకుంటే మిలియనీర్ల పెరుగుదలలో 455 శాతం నమోదు కావటం విశేషం.

సర్వేలో కనిపించిన మరో ఆసక్తికర అంశం ఏమంటే మిలియనీర్ కుటుంబాలు అంటే గతంలో ముంబయి.. ఢిల్లీ లాంటి ప్రధమ శ్రేణి నగరాల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు అహ్మాదాబాద్.. సూరత్.. విశాఖపట్నం.. జైపూర్.. లక్నో లాంటి టూటైర్ సిటీస్ లోనూ ఉండటం గమనార్హం. ఈ మిలియనీర్ కుటుంబాలు ప్రతి ఏడాది టూర్లు.. చదువులు.. వినోదం కోసం ఏకంగా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నట్లు తేలింది. మొత్తం మిలియనీర్ కుటుంబాల్లో ఇంత భారీగా ఖర్చు పెట్టేవారు 60 శాతం వరకు ఉండటం చూస్తే.. సంపాదించటమే కాదు..ఖర్చు విషయంలోనూ తగ్గని తీరు కనిపిస్తుంది.

ఇంతకు ఎంత సంపద ఉంటే.. పూర్తి ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లు భావిస్తారని ప్రశ్నించగా.. రూ.50 కోట్లు సరిపోతుందని 27 శాతం మంది చెబితే.. 20 శాతం మంది మాత్రం రూ.200 కోట్లు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మిలియనీర్లలో 40 శాతం మంది తాము వినియోగించే కారునే గడిచిన ఆరేళ్లుగా వాడుతున్నారు. 27 శాతం మంది యోగా తమకు ఇష్టమైన ఫిట్ నెస్ ప్రోగ్రాంగా చెప్పుకున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మిలియనీర్ కుటుంబాల్లోని42 శాతం మంది తమ పిల్లల్ని భారతదేశంలోనే చదివిస్తామని చెప్పటం. భారతదేశ ఆర్థిక సత్తాను చాటేలా మిలియనీర్ కుటుంబాల ఎదుగుదల ఉందని చెప్పాలి.