Begin typing your search above and press return to search.

పోర్చుగల్ లో విడాకుల రేటు 94%లో నిజమెంత?:

భారతదేశం వంటి దేశాల్లో విడాకులు అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయం అని అనేవారు. అది కూడా ఎక్కడో ఒకటి జరిగేదని చెబుతారు.

By:  Raja Ch   |   16 Oct 2025 4:00 PM IST
పోర్చుగల్ లో విడాకుల రేటు 94%లో నిజమెంత?:
X

భారతదేశం వంటి దేశాల్లో విడాకులు అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయం అని అనేవారు. అది కూడా ఎక్కడో ఒకటి జరిగేదని చెబుతారు. అయితే ఇటీవల కాలంలో మారుతున్న బంధాలు, తగ్గుతున్న విలువలు, పెరుగుతున్న ఆశలు, నిలకడలేని ఆలోచనలు, అలవాటుపడుతున్న పాశ్చాత్య జీవనశైలి.. కారణం ఏదైనప్పటికీ భారత్ లోనూ విడాకుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ఆసక్తిగా మారింది.

అవును... కారణం ఏదైనప్పటికీ, కారకులు ఎవరైనప్పటికీ ఇటీవల కాలంలో భారతదేశంలో విడాకుల రేటు పెరుగుతోంది! అయితే, ప్రపంచ స్థాయిలో ఈ రేటు చాలా తక్కువ అని చెప్పే ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... భారతదేశంలో ప్రతి 100 వివాహాలకు 1 విడాకులు జరుగుతున్నాయి. అంటే విడాకుల రేటు 1శాతం అన్నమాట. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ వెల్లడించింది!

తక్కువ, ఎక్కువ విడాకుల రేటు ఉన్న దేశాలివే!:

ఆ సంస్థ వెల్లడించిన డేటా ప్రకారం... భారతదేశంలో విడాకుల రేటు అత్యంత స్వల్పంగా 1%గా ఉండగా... దీని తరువాత వియత్నాం 7%, తజికిస్తాన్ 10%, ఇరాన్ 14%, మెక్సికో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికాలలో 17% గా ఉంది. మరోవైపు అత్యధికంగా ఉక్రెయిన్ 70%, రష్యా 73%, లక్సెంబర్గ్ 79%, స్పెయిన్ 85%, పోర్చుగల్ 94%గా ఉంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఇదే!:

ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని విడాకుల రేటును పరిశీలిస్తే... జపాన్ 35%, జర్మనీ 38%, యునైటెడ్ కింగ్‌ డమ్ 41%, ఆస్ట్రేలియా 43%, చైనా 44%, యునైటెడ్ స్టేట్స్‌ 45% గా ఉంది.

పోర్చుగల్ లో విడాకుల రేటు 94%లో నిజమెంత?:

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా పోర్చుగల్ దేశంలో ఊహించని స్థాయిలో అన్నట్లుగా విడాకుల రేటు ఉంది. అది ఏకంగా 94%! అంటే... వివాహం చేసుకున్న 100 మందిలో 94 మంది విడాకులు తీసుకుంటున్నారన్నమాట. అయితే... ఈ విడాకుల రేటు అనేది అసంభవం అనిపిస్తుందని చెబుతూ.. అందుకు లోపభూయిష్ట పద్ధతిపై ఆధారపడి ఈ డేటా ను నివేదించడమే అని అంటున్నారు!

వాస్తవానికి ఒక సంవత్సరంలో సుమారు 1000 మంది వివాహం చేసుకున్నారని అనుకుంటే... ఆ ఏడాదిలో విడాకులు తీసుకున్నవారు ఏ ఏడాదిలో వివాహం చేసుకున్నారనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా... వరల్డ్ స్టాటిస్టిక్స్ కౌంట్ వేరే మార్గాన్ని తీసుకుంది! ఇందులో భాగంగా... ఒక సంవత్సరంలో విడాకుల సంఖ్యను అదే సంవత్సరంలో జరిగిన వివాహాల సంఖ్యతో విభజించారు.

ఇది తప్పుదారి పట్టించేది. ఎందుకంటే... ఒక సంవత్సరంలో విడాకులు తప్పనిసరిగా అదే సంవత్సరంలో జరిగిన వివాహాల నుండి రావు కదా! పైగా పోర్చుగల్ లో కరోనా మహమ్మారి తర్వాత వివాహాల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.. మరోవైపు విడాకులు మాత్రం కొనసాగుతుంటాయి. దీంతో ఒక ఏడాది 100 వివాహాలే జరిగితే.. అప్పటికే వివాహాలు అయినవారు అదే ఏడాది 94 మంది విడాకులు తీసుకుంటే... అది 94% విడాకుల రేటుగా చూపించారన్నమాట. ఇది లోపభూయిస్ట పద్దతి అనేది నిపుణుల మాటగా ఉంది!