Begin typing your search above and press return to search.

నాసిక్‌ లో ఎగిరిన ఎల్‌.సీ.ఏ తేజ‌స్ ఎంకే1ఏ.. వాటర్ సెల్యూట్ వీడియో వైరల్!

అవును... ఎల్.సీ.ఏ.తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానం శుక్రవారం.. మ‌హారాష్ట్రలోని నాసిక్ ఎయిర్‌ బేస్‌ లో ఎగిరింది.

By:  Raja Ch   |   17 Oct 2025 4:18 PM IST
నాసిక్‌ లో ఎగిరిన ఎల్‌.సీ.ఏ తేజ‌స్ ఎంకే1ఏ.. వాటర్ సెల్యూట్ వీడియో వైరల్!
X

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్‌.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైపర్‌ సోనిక్‌ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఈ సమయంలో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్.సీ.ఏ) తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాన్ని హింధుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేయగా.. దాన్ని ఈ రోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు!

అవును... ఎల్.సీ.ఏ.తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానం శుక్రవారం.. మ‌హారాష్ట్రలోని నాసిక్ ఎయిర్‌ బేస్‌ లో ఎగిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ కు చెందిన మూడ‌వ ఉత్పత్తి కేంద్రం నుంచి ఆ విమానాన్ని త‌యారు చేయగా... రాజ్‌ నాథ్ సింగ్ స‌మ‌క్షంలో ఈ విమానం త‌న విన్యాసాలు ప్రద‌ర్శించింది. ఈ సందర్భంగా... ఎల్‌.సీ.ఏ ఎంకే1ఏకు చెందిన మూడ‌వ ప్రొడ‌క్షన్ లైన్‌ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా... ఎల్‌.సీ.ఏ తేజ‌స్ ఎంకే1ఏ యుద్ధ విమానానికి నాసిక్ ఎయిర్‌ బేస్‌ లో వాట‌ర్ సెల్యూట్ చేశారు. తేజ‌స్ ఫైట‌ర్ విమానాల‌ను ఇప్పటికే బెంగుళూరులోని రెండు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తుండగా.. అక్కడ ప్రతి ఏటా 16 విమానాల‌ను త‌యారు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాసిక్‌ లోనూ తయారీ కేంద్రాన్ని మొద‌లుపెట్టారు. దాదాపు రు.150 కోట్ల పెట్టుబ‌డితో ఈ కేంద్రాన్ని స్థాపించినట్లు చెబుతున్నారు.

హె.ఏ.ఎల్. ను ప్రశంసించిన రాజ్ నాథ్ సింగ్!:

భారతదేశ రక్షణ స్వావలంబనకు పెరుగుతున్న కృషికిగానూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) ను రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా నాసిక్ క్యాంపస్ ను తాను తొలిసారి సందర్శించానని చెబుతూ.. అక్కడి సిబ్బంది ఉత్సాహాన్ని ఆయన ప్రశంసించారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ముఖాల్లోనూ తాను గర్వాన్ని చూడగలిగానని అన్నారు.

ఈ సందర్భంగా... 'హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) నాసిక్‌'ను దేశ రక్షణ బలానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు. ఇదే క్రమంలో... నాసిక్ భూమి ఎంతో చారిత్రాత్మకమైనదని.. ఇక్కడ శివుడు త్రయంబకేశ్వర్ రూపంలో నివసిస్తున్నాడని.. ఈ భూమి విశ్వాసం, భక్తికి మాత్రమే కాదు, ఇప్పుడు స్వావలంబనను కూడా సూచిస్తుందని రక్షణ మంత్రి జోడించారు.