Begin typing your search above and press return to search.

DTH-కేబుల్ TV క‌స్ట‌మ‌ర్లు త‌గ్గిపోవ‌డానికి కార‌ణం ఇదేనా?

జూన్ 2026తో ముగిసిన సంవత్సర కాలంలో దేశంలోని పే-డీటీహెచ్ పరిశ్రమ ఏకంగా 75.1 లక్షల ఆక్టివ్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయి 13.4 శాతం క్షీణతను నమోదు చేసింది.

By:  Sivaji Kontham   |   14 Oct 2026 4:09 PM IST
DTH-కేబుల్ TV క‌స్ట‌మ‌ర్లు త‌గ్గిపోవ‌డానికి కార‌ణం ఇదేనా?
X

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. భారతీయ బుల్లితెర వీక్షణ రంగంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సంప్రదాయ పే-డీటీహెచ్ -కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లు తమ చందాదార్లను భారీగా కోల్పోతుండగా.. ఇంటర్నెట్ ఆధారిత ఐపీటీవీ (IPTV) విభాగం అనూహ్య వృద్ధిని నమోదు చేస్తోంది. మారుతున్న ప్రేక్షకుల అలవాట్లు .. వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణే ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

జూన్ 2026తో ముగిసిన సంవత్సర కాలంలో దేశంలోని పే-డీటీహెచ్ పరిశ్రమ ఏకంగా 75.1 లక్షల ఆక్టివ్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయి 13.4 శాతం క్షీణతను నమోదు చేసింది. దీనితో మార్కెట్లో డీటీహెచ్ చందాదార్ల సంఖ్య 4.86 కోట్లకు పడిపోయింది. ఈ విభాగంలో టాటా ప్లే 30.56 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారతీ టెలీమీడియా (27.97 శాతం), సన్ డైరెక్ట్ (22.51 శాతం), డిష్ టీవీ (18.96 శాతం) తదుపరి స్థానాల్లో నిలిచాయి. చందాదార్లు తగ్గినా.. సన్ డైరెక్ట్ మాత్రమే తన మార్కెట్ వాటాను స్వల్పంగా పెంచుకోగలిగింది.

మరొక వైపు.. ఎంఎస్‌ఓ ల పరిధిలోని సంప్రదాయ కేబుల్ టీవీ రంగం కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని తొమ్మిది ప్రధాన కేబుల్ నెట్‌వర్క్‌లు కేవలం తొమ్మిది నెలల్లోనే 44.25 లక్షల చందాదార్లను కోల్పోయాయి. జీటీపీఎల్ హాథ్‌వే అత్యధికంగా 22.28 లక్షల చందాలను కోల్పోగా.. డెన్ నెట్‌వర్క్స్ అత్యధికంగా 32.5 శాతం క్షీణతను చూసింది. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ తమిళనాడు అరసు కేబుల్ టీవీ 12.3 శాతం వృద్ధి సాధించి మినహాయింపుగా నిలిచింది.

ఈ క్షీణతకు భిన్నంగా ఐపీటీవీ సేవలు ఊహించని రీతిలో 333 శాతం వార్షిక వృద్ధిని సాధించి రికార్డు సృష్టించాయి. గత జూన్ 2025లో 14.34 లక్షలుగా ఉన్న ఐపీటీవీ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య జూన్ 2026 నాటికి ఏకంగా 62.07 లక్షలకు చేరుకుంది. ఈ రంగంలో భారతీ ఎయిర్‌టెల్ 40.91 లక్షల చందాదార్లతో ప్రధాన వాటాను దక్కించుకోగా.. హాథ్‌వే డిజిటల్ కూడా జూన్ త్రైమాసికంలో అత్యధిక వృద్ధిని కనబరిచి రెండో స్థానంలో నిలిచింది.

మొత్తంగా చూస్తే డీటీహెచ్, కేబుల్, ఐపీటీవీ, హెచ్‌ఐటీఎస్ రంగాలు అన్ని కలిపి దేశంలో జూన్ 2026 నాటికి 9.67 కోట్ల యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్లను కలిగి ఉన్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగం పెరగడం.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రాచుర్యం.. ఐపీటీవీ ఆఫర్లు సులభంగా అందుబాటులోకి రావడంతో... భారతీయ టీవీ వీక్షకులు క్రమంగా ఇంటర్నెట్ ఆధారిత వినోద మార్గాల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.