'కాంక్రీట్ ఇల్లు' వద్దే వద్దు.. 'కూలింగ్ ఇల్లు' ముద్దే ముద్దు.. ఇదిగిదిగో సరైన దారి!
భారతదేశంలో ఏటేటా వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోతుండటంతో వడగాల్పుల తీవ్రత అమాంతం పెరిగింది.
By: Sivaji Kontham | 19 May 2026 7:00 AM ISTభారతదేశంలో ఏటేటా వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోతుండటంతో వడగాల్పుల తీవ్రత అమాంతం పెరిగింది. నగరాలలో విపరీతంగా పెరిగిన కాంక్రీట్ నిర్మాణాలు `అర్బన్ హీట్ ఐలాండ్స్`గా మారి పగటి వేడిని రాత్రి వేళల్లో కూడా పట్టి ఉంచుతున్నాయి. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలు కేవలం శారీరక అసౌకర్యానికే పరిమితం కాకుండా డీహైడ్రేషన్, వడదెబ్బ, మూత్రపిండాల ఒత్తిడి వంటి తీవ్రమైన ప్రజారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా రేకుల ఇళ్లలో నివసించే నిరుపేదలు, నిరంతరం ఎండలోనే శ్రమించే బహిరంగ రంగా కార్మికులు ఈ ప్రమాదానికి ఎక్కువగా బలైపోతున్నారు. ఈ తరుణంలో ఇళ్లను కేవలం సిమెంట్, ఇటుకలతో కాకుండా సహజసిద్ధంగా చల్లదనాన్ని ఇచ్చేలా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా గదిని చల్లబరచడానికి మనం వాడే ఎయిర్ కండీషనర్లు (ఏసీ) తాత్కాలికంగా లోపల ఉపశమనాన్ని ఇచ్చినా.. అవి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఇవి భారీగా విద్యుత్‌ను వినియోగించడమే కాకుండా.. భూతాపానికి కారణమయ్యే ప్రమాదకరమైన రెఫ్రిజెరెంట్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇవి ఇళ్ల లోపల చల్లదనం ఇచ్చినా... బయట వీధులను మరింత వేడెక్కిస్తాయి. ఈ సవాలును స్వీకరించిన దేశీయ క్లైమేట్ స్టార్టప్‌లు ప్రస్తుతం సరికొత్త పర్యావరణహిత కూలింగ్ సాంకేతికతలను అందుబాటులోకి తెస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతులను ఆధునిక విజ్ఞానంతో మిళితం చేస్తూ వస్తున్న ఈ ఆవిష్కరణలు ఇళ్లను సహజమైన `కూలింగ్ ఇళ్లు`గా మార్చడానికి అద్భుతమైన మార్గాలను చూపిస్తున్నాయి.
ఈ సరికొత్త విప్లవంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన `అంబియేటర్` అనే స్టార్టప్ సంస్థ ఎటువంటి రెఫ్రిజెరెంట్ గ్యాస్ వాడకుండా పనిచేసే సరికొత్త కూలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీ సాధారణ ఎయిర్ కండీషనర్లతో పోలిస్తే ఏకంగా 80 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తూ.. గది ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఆహ్లాదకరంగా ఉంచుతుంది. మరోవైపు అంతరిక్ష సాంకేతికతను వాడుకుంటూ `శాట్‌లియో ల్యాబ్స్` అనే సంస్థ థర్మల్ శాటిలైట్లు - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నగరాల్లో పేరుకుపోతున్న కంటికి కనిపించని వేడిని ముందే పసిగడుతోంది. కర్ణాటకలోని తుమకూరు నగరంలో ఈ శాటిలైట్ డేటా ఆధారంగానే మున్సిపల్ అధికారులు అత్యధిక వేడి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు.
యంత్రాల సాయమే కాకుండా... మన సాంప్రదాయ నిర్మాణ శైలిని రీక్రియేట్ చేస్తూ ప్రకృతి సిద్ధమైన వనరులతో కూడా ఇళ్లను చల్లబరుస్తున్నారు. ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల బృందం కాల్చిన మట్టి ఆధారంగా `టెర్రాకూల్` అనే వాల్ కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసింది. ఇది గది ఉష్ణోగ్రతను ఏకంగా 7డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించడమే కాకుండా గదిలోని తేమను కూడా నియంత్రిస్తుంది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన ఒక పరిశోధక బృందం చెరకు పిప్పి- పుట్టగొడుగుల బీజాలను (మైసిలియం) ఉపయోగించి `ముష్‌కూల్` అనే బయోడిగ్రేడబుల్ సీలింగ్ ప్యానెళ్లను తయారు చేసింది. ఇవి పైకప్పు నుండి వచ్చే వేడిని ఇళ్ల లోపలికి రానివ్వకుండా అడ్డుకునే అద్భుతమైన ఇన్సులేషన్ సాధనాలుగా పనిచేస్తున్నాయి.
ఈ పర్యావరణహిత ప్రయోగాలు ఆధునిక సమాజంలో ఒక కొత్త ఆలోచనా విధానాన్ని లేవనెత్తుతున్నాయి. భారతదేశ కూలింగ్ భవిష్యత్తు అనేది కేవలం మరిన్ని ఎక్కువ శక్తివంతమైన ఏసీలను కొనుగోలు చేయడం కాదు... మన ఇళ్లను, నగరాలను వేడికి తట్టుకునేలా పునర్నిర్మించుకోవడమేనని ఇవి నిరూపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో ఏసీలపై ఆధారపడకుండా వేడిని తగ్గించేలా తక్కువ ఖర్చుతో కూడిన `రెట్రోఫిట్ కూలింగ్ కిట్లను` కూడా నిపుణులు ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయ మట్టి నిర్మాణాల గొప్పదనాన్ని, ఆధునిక అంతరిక్ష సాంకేతికతను మిళితం చేస్తూ వస్తున్న ఈ విధానాలను అలవర్చుకుంటే ప్రతి ఇల్లూ పర్యావరణానికి హాని చేయని నందనవనంగా మారడం ఖాయం. ముఖ్యంగా మనుషులు వడగాలులకు వడపిట్టల్లా రాలిపోకుండా ఉండాలంటే, తక్షణం మారడానికి ఈ తరుణోపాయాన్ని పరిశీలించేలా ప్రభుత్వాలే నడుంకట్టాలి. భవిష్యత్ లో కాంక్రీట్ జంగిల్స్ నిర్మాణాల కంటే నేచురల్ కూల్ సిస్టమ్ లో ఇండ్లను నిర్మించుకునేలా ప్రజల్ని పురికొల్పాలి.
