భూమి మండిపోతుంది జాగ్రత్త !
ప్రస్తుతం అగ్గి కార్తెలు నడుస్తున్నాయి. ఈ నెల 10 నుంచి మొదలైన అగ్గి కార్తెలతో అగ్గి రాలుస్తోంది. బయట ఎండ వేడిమి తారస్థాయికి చేరుకుంటోంది.
By: Satya P | 19 May 2026 5:00 AM ISTఎండలతో భూమి వేడెక్కడం కాదు మండిపోతుంది అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎండలు మామూలుగా ఉండవని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు తీవ్ర తరం అయ్యాయి. 45 డిగ్రీల సెల్సియస్ ని క్రాస్ చేస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజులలో మరింతగా ఎండలు ముదిరే అవకాశలు ఉందని అంటున్నారు. అందువల్ల మధ్యాహ్నం సమయం లో ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు.
అగ్గి రాలుస్తోంది :
ప్రస్తుతం అగ్గి కార్తెలు నడుస్తున్నాయి. ఈ నెల 10 నుంచి మొదలైన అగ్గి కార్తెలతో అగ్గి రాలుస్తోంది. బయట ఎండ వేడిమి తారస్థాయికి చేరుకుంటోంది. దాంతో అనేక చోట్ల వేసవి తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. అగ్గి కార్తెలు మరో వారం రోజుల పాటు కొనసాగనున్నాయి . ఈ అగ్గి కార్తెలలోనే తీవ్ర వడ గాలులు వీస్తున్నాయి. అందుకే రానున్న రోజులల్లో బయటకు ఎవరూ వెళ్లరాదని ప్రకృతి విపత్తుల సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లౌ అసలు బయట తిరగవద్దు అని కూడా సూచిస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ తగిన విధంగా వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలని దిశా నిర్దేశం చేస్తున్నారు.
రోళ్ళు బద్ధలు అవుతాయి :
ఇక అసలైన ఎండలు ముందు ముందు ఉన్నాయని అంటున్నారు. రోహిణీ కార్తెలు అంటేనే రోళ్ళు బద్ధలు కొట్టే ఎండలు అని అంటారు. అలా ఈ నెల 25 నుంచి రోహిణి కార్తెలు మొదలవుతున్నాయి. జూన్ 8 వరకూ రోహిణీ కార్తెలు రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్క లెక్కన మండించేస్తాయని అంటున్నారు. ఆ తరువాత వచ్చే మృగశిర కార్తెలతోనే వేసవి ఎండల తాకిండి ఎంతో కొంత తగ్గుతుందని అంటున్నారు. అంటే ఇరవై రోజుల పాటు తీవ్రాతితీర్వమైన ఎండలు ఉన్నాయని చెబుతున్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ తగిన విధంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు :
ఇదిలా ఉండగా, దేశంలోని అనేక ప్రాంతాలలో రానున్న నాలుగైదు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని పెర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక దేశంలోని అనేక ప్రాంతాలలో వానలు కురియడానికి జూన్ మొదటి వారం వరకూ చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
కేంద్రం హెచ్చరికలు :
ప్రస్తుత వేసవి కాలానికి సంబంధించి తీవ్రమైన వేడి వడగాలులపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాలను సూచనలను జారీ చేసింది. ప్రతీ ఒక్కరూ తగినంతగా నీరు తాగడం, తేలికపాటి కాటన్ దుస్తులను ధరించడం వంటివి చేయాలని కోరింది. తల తిరగడం, తలనొప్పి, వికారం, మానసిక స్థితిలో మార్పులు, అధిక శరీర ఉష్ణోగ్రత, డీహైడ్రేషన్, మూర్ఛలు స్పృహ కోల్పోవడం వంటి వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాద సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రాలను హెచ్చరించింది. వడదెబ్బకు తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే సందర్భాల్లో 108 102 అత్యవసర హెల్ప్‌లైన్‌లకు వెంటనే కాల్ చేయాలని కోరింది.
