డిజిటల్ విప్లవం, యువతే మన బలం.. టీవీ9 సదస్సులో జూపల్లి రాము రావు కీలక వ్యాఖ్యలు!
రాము రావు తన ప్రసంగంలో భారత్‌ను 'గ్లోబల్ టాలెంట్ హబ్'గా మార్చిన కీలక అంశాలను ప్రస్తావించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో భారతీయుల అసాధారణ నైపుణ్యంను వివరించారు.
By: A.N.Kumar | 26 March 2026 4:19 PM ISTదేశ రాజధాని వేదికగా మార్చి 23, 24 తేదీల్లో టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘What India Thinks Today (WITT) 2026’ గ్లోబల్ సమ్మిట్ అద్భుత విజయంతో ముగిసింది. రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, క్రీడా రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే వేదికపై చేరి, నవ భారత్ దిశానిర్దేశంపై లోతైన చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు.
యువతే భారత్ బలం: మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు
ఈ సదస్సులో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుత ప్రపంచం 'పాలీ క్రైసిస్' లాంటి బహుముఖ సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని ఎలా సాధిస్తుందో ఆయన విశ్లేషించారు. "ప్రతిభావంతులైన యువతే భారత్‌కు అసలైన శక్తి. ప్రపంచానికి మన యువతపై నమ్మకం పెరుగుతోంది. ప్రజాస్వామ్య బలాలు, భారీ జనాభా, వైవిధ్యం మనల్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెడుతున్నాయి." అని జూపల్లి రాము రావు పేర్కొన్నారు.
రాము రావు తన ప్రసంగంలో భారత్‌ను 'గ్లోబల్ టాలెంట్ హబ్'గా మార్చిన కీలక అంశాలను ప్రస్తావించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో భారతీయుల అసాధారణ నైపుణ్యంను వివరించారు. డేటా వినియోగం, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా ఎదుగిందన్నారు.. ఆంగ్ల భాషపై పట్టు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉండటం మన యువతకు ఉన్న అదనపు బలమన్నారు. క్లిష్ట సమయాల్లోనూ సృజనాత్మకంగా ఆలోచించే తత్వం భారతీయుల సొంతమన్నారు. భారత్ ప్రస్తుతం సుమారు 7 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోందని.. అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారత్ ఇక వినియోగదారుడు కాదు.. ఉత్పత్తిదారు: ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో భారత గ్లోబల్ ఇమేజ్‌లో వచ్చిన మార్పును వివరించారు. ఒకప్పుడు కేవలం టెక్నాలజీ వినియోగదారుడిగా ఉన్న భారత్.. నేడు ప్రపంచానికి ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో టీవీ9 నెట్‌వర్క్ అందించిన బాధ్యతాయుతమైన కవరేజ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
భవిష్యత్ భారత్ దిశానిర్దేశం
మొత్తంగా WITT 2026 సమ్మిట్ కేవలం ఒక చర్చా వేదికగా మాత్రమే కాకుండా భారత్ భవిష్యత్తుకు ఒక బ్లూప్రింట్‌ను అందించింది. యువత పాత్ర, సాంకేతికతలో స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వం అనే మూడు సూత్రాలు భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతాయని ఈ సదస్సు వేదికగా మరోసారి స్పష్టమైంది.
