Begin typing your search above and press return to search.

6 నెలల్లోనే 600 కేజీలు.. ఇప్పటి వరకు RBI దగ్గర ఎంత బంగారం ఉంది ..

అయితే ఈ బంగారం మొత్తం విలువ.. రూ:8.36 లక్షల కోట్లతో సమానం. 2025-26 ఫైనాన్స్ ఇయర్లో తొలి ఆరు నెలల్లోనే 600 కేజీలను ఇప్పటికే కొనుగోలు చేసింది.

By:  Madhu Reddy   |   23 Oct 2025 7:00 PM IST
6 నెలల్లోనే 600 కేజీలు.. ఇప్పటి వరకు RBI దగ్గర ఎంత బంగారం ఉంది ..
X

ప్రపంచవ్యాప్తంగా బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.. రాజుల కాలం నుంచి బంగారం ఒక ప్రధాన సంపదగా ఉంటూ వస్తోంది. బంగారాన్ని ఇండియాలోని మహిళలు అత్యంత ప్రీతిపాత్రంగా ధరిస్తూ ఉంటారు. చాలామంది వారు సంపాదించే డబ్బుల్లో భూములు, ఇళ్ళు, బంగారానికి ఖర్చు పెడుతూ ఉంటారు. అలా బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడే దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అలాంటి ఈ తరుణంలో భారత దేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం ఎంత నిల్వ ఉంది.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ర్యాంక్ ఎంత ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అనేవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో బంగారం ధర ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కూడా బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టింది.. ఇప్పటికే భారత్ బంగారం నిలవల్లో ఏడవ స్థానంలో నిలిచింది. అయితే ఇలా బంగారం నిల్వలను పెంచుకోవడానికి ప్రధాన కారణం యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. వీటివల్లే బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అలాంటి ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొనుగోళ్లలో చాలా ముందుకు వెళ్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఎంత బంగారం నిల్వ ఉందంటే 880 టన్నులని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బంగారం నిల్వల్లో ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం ఏడవ స్థానంలో ఉందని చెప్పవచ్చు.

అయితే ఈ బంగారం మొత్తం విలువ.. రూ:8.36 లక్షల కోట్లతో సమానం. 2025-26 ఫైనాన్స్ ఇయర్లో తొలి ఆరు నెలల్లోనే 600 కేజీలను ఇప్పటికే కొనుగోలు చేసింది. అలాంటి ఈ సమయంలో ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది..ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏ స్థానంలో ఉందనేది కూడా బయటకు వచ్చింది. ఇందులో అమెరికా 8133.46 టన్నులతో మొదటి స్థానంలో ఉండగా..జర్మనీ 3,351.53 టన్నులతో రెండో స్థానంలో నిలిచింది. ఇటలీ 2,451.84 టన్నులతో మూడవ స్థానం.. ఫ్రాన్స్ 2,436.94 టన్నులతో నాలుగవ స్థానం.. చైనా 2264.32 టన్నులతో 5వ స్థానం..స్విట్జర్ ల్యాండ్ 1039.94 టన్నులతో 6వ స్థానం,భారత్ 880 టన్నులతో ఏడవ స్థానంలో నిలిచింది. జపాన్ 845.97 టన్నులతో ఎనిమిదవ స్థానం..రష్యా 750 టన్నులతో 9వ స్థానం, నెదర్లాండ్ 612.45 టన్నులతో పదవ స్థానంలో నిలిచింది.

ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ బంగారం నిల్వలను పెంచుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు అనేవి గత కొద్ది రోజుల నుండి స్థిరంగా పెరుగుతూ వచ్చి 2024 నుంచి 2025 మధ్య మాత్రం 28 శాతం పెరిగింది. ఈ విధంగా బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో కేంద్ర బ్యాంకులు వాటి నిల్వలను పెంచుకుంటున్నాయి.