Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: బ్యారెల్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గినా పెట్రోల్ ధ‌ర త‌గ్గించ‌రా?

ఈ డిబేట్‌లో వినియోగదారులపై పడుతున్న పన్నుల భారం ప్రధానంగా చర్చకు వచ్చింది.

By:  Sivaji Kontham   |   20 Jun 2026 11:10 AM IST
ట్రెండీ టాక్‌: బ్యారెల్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గినా పెట్రోల్ ధ‌ర త‌గ్గించ‌రా?
X

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రతి బారెల్‌కు 78 డాలర్లకు పడిపోయి.. గత మూడు నెలల కనిష్ట స్థాయిని తాకినా భార‌త ప్ర‌భుత్వం ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోవ‌డంపై సామాజిక మాధ్యమ వేదిక `రెడ్డిట్ లోని ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫోరమ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా భారత్‌లో ఇంధన ధరలను తగ్గించకపోవడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో చమురు ధరలు తగ్గకపోతే ద్రవ్యోల్బణం పెరిగి.. ఆర్థిక వృద్ధి మందగిస్తుందని... ప్రభుత్వం సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ డిబేట్‌లో వినియోగదారులపై పడుతున్న పన్నుల భారం ప్రధానంగా చర్చకు వచ్చింది. ముడిచమురు ధరలు పెరిగినప్పుడు లీటరుకు ఎనిమిది రూపాయల వరకు పెంచిన ప్రభుత్వం... ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాన్ని ప్ర‌జ‌లకు బదిలీ చేయడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల కోసం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం ఏటికేడు పిండేస్తోందని.. 2014 నాటి యూపీఏ ప్రభుత్వ కాలం నాటి వ్యతిరేక పరిస్థితులే ప్రస్తుత ప్రభుత్వంపై కూడా కనిపిస్తున్నాయని కొందరు కామెంట్ చేశారు.

మరోవైపు.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ధరలకు, దేశాలు కొనుగోలు చేసే భౌతిక మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని కొందరు ఆర్థిక కోణాన్ని విశ్లేషించారు. 2026 మార్చిలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 100 నుండి 110 డాలర్లకు పెరిగినప్పుడు... ఆ భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపై పడకుండా కొంతకాలం నియంత్రించిందని ఒక నెటిజన్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఇంధన ధరల స్థిరత్వాన్ని కాపాడటం వల్లే భారీ యుద్ధ సమయాల్లో కూడా దేశంలో ధరలు అదుపులో ఉన్నాయని, తక్షణమే ప్రయోజనాలు ఆశించడం సరికాదనే వాదన కూడా వినిపించింది.

ఇంధన ధరల నియంత్రణకు గానూ ప్రభుత్వం చేపడుతున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానంపైనా రెడ్డిట్ వినియోగదారులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చమురు ధరలు ఎంత తగ్గినా.. పెట్రోల్, డీజిల్ పరిమాణాన్ని తగ్గించి దాని స్థానంలో ఇథనాల్‌ను ఎక్కువగా కలుపుతున్నారని నెటిజన్లు ఆరోపించారు. దీనివల్ల సామాన్యుడికి ధరల భారం తగ్గడం లేదని... కేవలం ఇథనాల్ తయారుచేసే బడా వ్యాపారవేత్తలకు, పాలకుల కుటుంబాలకే లాభం చేకూరుతోందంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి కొందరు ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ఈ ఇంధన సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా ఈవీ అడాప్టేష‌న్ వైపు మారడమే ఏకైక మార్గమని కొందరు అభిప్రాయపడగా... అది అంత సులువు కాదని మరికొందరు గణాంకాలతో వివరించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 5 కోట్ల కార్లు, 26 కోట్ల ద్విచక్ర వాహనాలను ఈవీలుగా మార్చాలంటే దేశ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని మరో 600 నుండి 700 శాతం పెంచాల్సి ఉంటుందని... లేదంటే గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా.. అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల ప్రయోజనం దేశీయంగా సామాన్యుడికి అందడం లేదనేది ఈ మొత్తం చర్చ సారాంశం.