ఫారెక్స్ నిల్వలకు భారీ దెబ్బ.. ఆర్‌బీఐ చేతిలో డాలర్లెంత?
భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా రెండో వారం కూడా భారీగా క్షీణించాయి. కేవలం ఒక్క వారంలోనే దాదాపు 14.881 బిలియన్ డాలర్ల మేర నిల్వలు ఆవిరైపోవడం ప్రస్తుతం ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 26 Sept 2026 10:47 PM ISTభారత విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా రెండో వారం కూడా భారీగా క్షీణించాయి. కేవలం ఒక్క వారంలోనే దాదాపు 14.881 బిలియన్ డాలర్ల మేర నిల్వలు ఆవిరైపోవడం ప్రస్తుతం ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్కెట్‌లో నేరుగా జోక్యం చేసుకోవడమే ఈ హఠాత్ తగ్గుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు వారాల్లో $19.8 బిలియన్ల తగ్గుదల
ఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే మొదట ఒక వారంలో $4.924 బిలియన్లు క్షీణించి ఫారెక్స్ నిల్వలు $780.782 బిలియన్లకు చేరాయి. అయితే ఆ మరుసటి వారంలో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా ఏకంగా $14.881 బిలియన్ల మేర నిల్వలు పడిపోవడంతో ప్రస్తుతం భారత ఫారెక్స్ నిల్వలు $765.901 బిలియన్ల స్థాయికి దిగివచ్చాయి. అంటే కేవలం 14 రోజుల వ్యవధిలోనే దేశం ఏకంగా $19.8 బిలియన్ల డాలర్ల నిల్వలను కోల్పోవడం గమనార్హం. నవంబర్ 2024 తర్వాత ఈ స్థాయిలో ఫారెక్స్ నిల్వలు ఒకే వారంలో క్షీణించడం ఇదే తొలిసారి.
రూపాయి కాపాడేందుకు ఆర్‌బీఐ డాలర్ల ప్రయోగం
గ్లోబల్ మార్కెట్‌లో యుఎస్ డాలర్ బలపడటం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం.. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం వల్ల రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రూపాయి విలువ ఒక్కసారిగా భారీగా పడిపోకుండా అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్ల నిల్వలను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తోంది. దీనివల్ల మార్కెట్లో డాలర్ల లభ్యత పెరిగి రూపాయి క్షీణతకు కొంతవరకు అడ్డుకట్ట పడుతున్నప్పటికీ ఆ ప్రభావం నేరుగా దేశ ఫారెక్స్ నిల్వలపై పడుతోంది.
ఆందోళన అవసరమా?
ఫారెక్స్ నిల్వలు తగ్గినంత మాత్రాన భారత ఆర్థిక వ్యవస్థ తక్షణమే ప్రమాదంలో పడినట్లు భావించాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ భారత్ వద్ద కొన్ని నెలల దిగుమతులకు సరిపడా సురక్షితమైన స్థాయిలో నిల్వలు ఉన్నాయి. అయితే రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగి ఆర్‌బీఐ నిరంతరం డాలర్లను విక్రయించాల్సి వస్తే మాత్రం భవిష్యత్తులో అది కొంత ఆందోళన కలిగించే అంశమే.
ప్రస్తుతానికి ఈ తగ్గుదలను ఆర్థిక బలహీనతగా కాకుండా కరెన్సీ స్థిరత్వం కోసం ఆర్‌బీఐ సమర్థవంతంగా తీసుకుంటున్న రక్షణ చర్యగా చూడాలని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు అంతర్జాతీయ పరిస్థితులు చల్లబడి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగితే ఫారెక్స్ నిల్వలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
