దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ సిద్ధం.. రైలు ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది.. దీనివల్ల లాభాలేంటంటే?
భారతదేశం 2070 నాటికి 'నెట్ జీరో' లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రతిష్టాత్మకమైన టార్గెట్‌ను పెట్టుకుంది. ఈ హరిత ఇంధన రైళ్ల ప్రవేశం ఆ లక్ష్య సాధనలో కీలక మైలురాయి కానుంది.
By: A.N.Kumar | 26 Jun 2026 8:00 PM ISTదేశీయ రవాణా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణ, అత్యాధునిక సాంకేతికత కలయికతో రూపొందిన దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో నిర్వహించిన ఈ రైలు తుది ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ రైలు.. ప్రయోగాత్మక పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ విజయంతో త్వరలోనే ఈ గ్రీన్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ప్రపంచ దేశాల సరసన భారత్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ సాంకేతికతతో నడిచే రైళ్లు కేవలం జర్మనీ, చైనా, జపాన్, అమెరికా వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం కూడా చేరబోతోంది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ హైడ్రోజన్ రైళ్లు భవిష్యత్తులో భారత రైల్వేలో కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించడంలో గేమ్ చేంజర్‌గా మారనున్నాయి.
ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలేంటి?
ఈ రైలు అత్యంత అధునాతనమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేస్తుంది. దీని పనితీరు, ప్రత్యేకతలు ఏంటంటే..
జీరో కాలుష్యం దీనివల్ల సాధ్యం. హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా ఈ రైలులో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కాలుష్య కారకాలు ఏవీ విడుదల కావు. పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అద్భుతమైన మైలేజ్, తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఈ రైళ్లలో ఇంధనం నింపడం చాలా సులభం. కేవలం 15 నుండి 20 నిమిషాల్లో పూర్తి ట్యాంక్ ఇంధనాన్ని నింపవచ్చు. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఏకంగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంటుంది.
శబ్ద కాలుష్యానికి చెక్ పడనుంది. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నప్పుడు చాలా తక్కువ శబ్దం వస్తుంది. ప్రయాణికులకు ఇది నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చు మనకు లాభం. ఈ సాంకేతికత వల్ల ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా, లాంగ్ రన్‌లో రైళ్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
'నెట్ జీరో' లక్ష్యం దిశగా అడుగులు
భారతదేశం 2070 నాటికి 'నెట్ జీరో' లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రతిష్టాత్మకమైన టార్గెట్‌ను పెట్టుకుంది. ఈ హరిత ఇంధన రైళ్ల ప్రవేశం ఆ లక్ష్య సాధనలో కీలక మైలురాయి కానుంది.
తొలి దశలో హరియాణాలో ప్రారంభం కానున్న ఈ సేవలను, త్వరలోనే దేశంలోని ఇతర పర్యాటక, చారిత్రాత్మక పర్వత ప్రాంత హిల్ స్టేషన్స్ మార్గాల్లో కూడా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. పర్యావరణహిత హరిత ఇంధనంతో నడిచే ఈ రైళ్లు భారతీయ రైల్వే రూపురేఖలను మార్చడమే కాకుండా రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
