Begin typing your search above and press return to search.

మూడేళ్ల వరకూ నో వీసా.. అమెరికా నిర్ణయంతో భారతీయులకు నిరాశ

భారత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వివిధ రకాల వీసాలతో విద్య, ఉద్యోగం, ఫ్యామిలీ రీ–యూనియన్ వంటి అమెరికాకు వెళ్తున్నారు.

By:  A.N.Kumar   |   21 Oct 2025 6:09 PM IST
మూడేళ్ల వరకూ నో వీసా.. అమెరికా నిర్ణయంతో భారతీయులకు నిరాశ
X

అమెరికా మరోసారి భారతీయులకు షాక్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం వేలాదిమందికి గ్రీన్‌కార్డ్ కలను నెరవేర్చే డైవర్సిటీ వీసా లాటరీ నుంచి భారత్‌ను మరో మూడేళ్ల పాటు తప్పించింది. ఈ నిర్ణయంతో యూఎస్‌ పర్మనెంట్ రెసిడెన్సీ (గ్రీన్ కార్డ్) ఆశించిన లక్షలాది భారతీయులు నిరాశకు గురయ్యారు.

* డైవర్సిటీ వీసా లాటరీ అంటే ఏమిటి?

డైవర్సిటీ వీసా ప్రోగ్రాం అనేది అమెరికా ప్రభుత్వం 1990లో ప్రారంభించిన ఒక ప్రత్యేక వీసా పథకం. దీని ఉద్దేశ్యం అమెరికాలోని జనాభాలో వైవిధ్యాన్ని పెంచడం. ప్రతి సంవత్సరం సుమారు 55,000 వీసాలు అమెరికా వెలుపల ఉన్న దేశాల పౌరులకు ఈ లాటరీ ద్వారా ఇస్తారు. అమెరికాకు తక్కువ వలసదారులు పంపే దేశాలకు ఈ వీసాలు కేటాయిస్తారు. అంటే, గత ఐదు సంవత్సరాల్లో 50,000 మందికి పైగా యూఎస్ వీసాలు పొందిన దేశాలకు ఈ లాటరీలో అవకాశం ఉండదు.

* భారతీయులకు ఎందుకు నో ఛాన్స్?

భారత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వివిధ రకాల వీసాలతో విద్య, ఉద్యోగం, ఫ్యామిలీ రీ–యూనియన్ వంటి అమెరికాకు వెళ్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో భారతీయులు పొందిన వీసాల సంఖ్య 50,000 దాటింది. దీని వలన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నియమాల ప్రకారం భారత్‌ "హై మైగ్రేషన్ కంట్రీ" కేటగిరీలోకి వస్తుంది.

అందువల్ల, భారత్‌కు ఈ లాటరీలో కనీసం మూడేళ్ల వరకు అవకాశం లేదు.

* ఏఏ దేశాలకు అవకాశం ఉంది?

2027 లాటరీ వీసా ప్రోగ్రాంలో ఆఫ్రికా, యూరప్, ఆసియా, సౌత్ అమెరికా దేశాల్లో వలసలు తక్కువగా ఉన్న దేశాలకు అవకాశం ఉంది. ఉదాహరణకు నేపాల్, శ్రీలంక, భూటాన్, ఉజ్బెకిస్తాన్, కెన్యా, జమైకా వంటి దేశాలు ఇందులో ఉంటాయి. అయితే భారత్‌, చైనా, మెక్సికో, కెనడా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు జాబితాలో లేవు.

* భారతీయ యువతలో నిరాశ

అమెరికాలో స్థిరపడాలని కలలు కనేవారికి ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగించింది. ప్రత్యేకించి H-1B వీసాల పరిమితులు, గ్రీన్‌కార్డ్ ప్రాసెస్‌లో ఆలస్యం, ఇప్పుడు డైవర్సిటీ లాటరీలోనూ నో ఛాన్స్ రావడం.. "డ్రీమ్ అమెరికా" అనేది మరింత దూరమవుతున్నట్లే.

అమెరికా వీసా విధానాలు క్రమంగా కఠినతరం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత యువత ఇతర అవకాశాలను కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల్లో చదువు, ఉద్యోగం లేదా స్టార్టప్ వీసాలను పరిశీలిస్తున్నారు. అయినా, అమెరికా కల మాత్రం ఇంకా చాలా మందికి వదలని ఆకర్షణగానే మిగిలింది.