Begin typing your search above and press return to search.

సైబర్ స్కామ్ కేంద్రాల్లో భారతీయులు.. ఇండియన్ ఎంబసీ కీలక స్టెప్!

మయన్మార్‌ లోని కేకే పార్క్‌ లో చైనా మాఫియా నడుపుతున్న కాంపౌండ్‌ పై బర్మీస్ సైనిక జుంటా గత నెలలో దాడి చేసిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   7 Nov 2025 1:00 AM IST
సైబర్ స్కామ్ కేంద్రాల్లో భారతీయులు.. ఇండియన్ ఎంబసీ కీలక స్టెప్!
X

మయన్మార్‌ లోని కేకే పార్క్‌ లో చైనా మాఫియా నడుపుతున్న కాంపౌండ్‌ పై బర్మీస్ సైనిక జుంటా గత నెలలో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. అక్కడ పనిచేస్తున్న భారతీయులతో సహా సుమారు 1,500 మంది విదేశీ పౌరులు పారిపోవాల్సి వచ్చింది! వారిలో చాలామంది మోయి నదిని ఈదుతూ పొరుగున ఉన్న థాయిలాండ్‌ కు పారిపోయారని థాయ్ సైన్యం తెలిపింది.

అయితే వారిలో భారతీయులు సుమారు 500 మంది వరకూ ఉంటారని అంటున్నారు. ఈ సమయంలో వారిని తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలను ఇండియన్ ఎంబసీ ప్రారంభించింది. దీనికోసం మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో 270 మందిని స్వదేశానికి తరలించినట్లు థాయిలాండ్‌ లోని మన రాయబార కార్యాలయం వెల్లడించింది.

అవును... మయన్మార్‌ లోని సైబర్ స్కామ్ కేంద్రం నుండి థాయిలాండ్‌ కు పారిపోయిన వందలాది మంది పౌరులను భారతదేశం గురువారం స్వదేశానికి రప్పించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు సైనిక విమానాలు థాయ్ సరిహద్దు పట్టణం మే సోట్ నుండి 26 మంది మహిళలు సహా 270 మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చాయి.

ఈ సందర్భంగా... మయన్మార్‌ లోని మైవాడి నుండి థాయిలాండ్‌ లోకి ప్రవేశించిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత వైమానిక దళం రెండు ప్రత్యేక విమానాలను నడిపిందని, అక్కడ వారు సైబర్ స్కామ్ కేంద్రంలో పనిచేస్తున్నారని బ్యాంకాక్‌ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది.

ఇదే సమయంలో.. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు భారతీయ పౌరులను థాయ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని రాయబార కార్యాలయం తెలిపింది. ఈ క్రమంలో థాయిలాండ్ నుండి మరింత మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి శుక్రవారం మరిన్ని విమానాలు నడపబడతాయని సమాచారం.

ఇలా థాయ్‌ నుంచి భారత్ కు చేరుకున్న తర్వాత అధికారులు వారిని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... సైబర్‌ నేరాల శిబిరాల్లో ఎలా చిక్కుకునారు..? అక్కడ నుంచి వారి ఆపరేషన్‌ విధానం ఎలా సాగుతుంది..? మొదలైన వివరాలను తెలుసుకోనున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో విదేశాల్లో నకిలీ ఉద్యోగావకాశాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆయా నియామక సంస్థల విశ్వసనీయతపై ముందస్తుగా ధ్రువీకరించుకోవాలని ఉద్యోగార్థులకు భారత రాయబార కార్యాలయం సూచించింది.

అదేవిధంగా... భారతీయ పాస్‌ పోర్ట్ హోల్డర్లకు థాయిలాండ్‌ లోకి వీసా రహిత ప్రవేశం పర్యాటక, స్వల్ప వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడిందని.. థాయిలాండ్‌ లో ఉపాధిని చేపట్టడానికి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదని బ్యాంకాక్‌ లోని రాయబార కార్యాలయం ఈ సందర్భంగా తెలిపింది.