Begin typing your search above and press return to search.

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్... ఏపీ, తెలంగాణకు కలిగే లాభాలివే..!

అవును.. భారత్‌ - ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో సుంకాల భారం చాలా వరకూ తగ్గనుందనే చర్చ జరుగుతుంది.

By:  Raja Ch   |   27 Jan 2026 10:00 PM IST
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్... ఏపీ, తెలంగాణకు కలిగే లాభాలివే..!
X

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ట్రంప్ సుంకాల ఫీవర్ కి అద్భుతమైన వ్యాక్సిన్ కనుగొనబడిందనే చర్చ తాజాగా భారత్ - ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టీ.ఏ) సందర్భంగా నెలకొంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చెబుతున్న ఈ ఎఫ్.టీ.ఏ కుదిరినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. దీంతో.. ఈ ఒప్పందం వల్ల భారత్ కు కలిగే ప్రయోజనాలు.. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు కలిగే మేలుల గురించిన చర్చ అప్పుడే మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్...!

అవును.. భారత్‌ - ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో సుంకాల భారం చాలా వరకూ తగ్గనుందనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి... ఈ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. డీల్‌ ఖరారైన తర్వాత యురోపియన్ యూనియన్ చేసిన కీలక ప్రకటనతో కొన్ని ఉత్పత్తులపై సుంకాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా.. 90శాతం భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించనున్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి... యూరప్ కంట్రీస్ కు చెందిన ఆటోమొబైల్‌ ఉత్పత్తులపై భారత్‌ 66 శాతం నుంచి 125 శాతం దిగుమతి సుంకాలు వసూలు చేస్తోంది. అయితే.. తాజా ఒప్పందం నేపథ్యంలో ఈ సుంకాలు దశలవారీగా తగ్గనున్నాయి. ఇందులో భాగంగా... బీఎండబ్ల్యూ, ఆడీ, వాల్వో, మెర్సిడేజ్ బెంజ్ మొదలైన లగ్జరీ కార్లపై సుంకాలను తొలుత 40 శాతానికి.. ఆ తర్వాత 10 శాతం వరకు తగ్గించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వైన్‌ పై భారత్ 150 శాతం సుంకాలు వసూలుచేస్తోండగా.. ఇవి 20-30 శాతానికి తగ్గనున్నాయని అంటున్నారు!

మరోవైపు... ప్రస్తుతం భారత్‌ లో యంత్రాలపై 44 శాతం, కెమికల్స్‌ పై 22 శాతం, ఫార్మా ఉత్పత్తులపై 11 శాతం సుంకాలు ఉండగా.. వీటిల్లో చాలావరకు సుంకాలను ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓవరాల్ గా... వాణిజ్య ఒప్పందం ప్రకారం ఐరోపా సమాఖ్య రాబోయే ఏడు సంవత్సరాల కాలంలో 99.5% వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గిస్తుందని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ వెల్లడించారు!

ఇదే క్రమంలో... భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం... భారత సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్ర వస్తువులు, రసాయనాలు, రబ్బరు, మూల లోహాలు, రత్నాలు, ఆభరణాలపై సుంకాలు సున్నాకి తగ్గించబడతాయి! ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తాజాగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏ విధంగా ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే అవకాశాలున్నాయనే విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... సముద్ర ఉత్పత్తులు, కెమికల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ కు తాజాగా ఒప్పందం ప్రత్యక్షంగా మేలు కలిగించనుండగా.. టెక్స్‌ టైల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాల ఉత్పత్తుల్లో తెలంగాణకు లబ్ధి చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు!