Begin typing your search above and press return to search.

డైల‌మా.. క‌న్ఫ్యూజన్! E20 పెట్రోల్‌తో ఇక్క‌ట్లే లేవ‌ని త‌ప్ప‌దారి ప‌ట్టిస్తున్నారా?

ప్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.. పాత వాహనాలకు E20 వల్ల ముప్పు పొంచి ఉందనేది కాదనలేని వాస్తవం.

By:  Sivaji Kontham   |   2 April 2026 7:00 AM IST
డైల‌మా.. క‌న్ఫ్యూజన్! E20 పెట్రోల్‌తో ఇక్క‌ట్లే లేవ‌ని త‌ప్ప‌దారి ప‌ట్టిస్తున్నారా?
X

భారతదేశంలో 2026 ఏప్రిల్ 1 నుండి ఇంధన రంగంలో ఒక పెను మార్పు చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విక్రయించే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) తప్పనిసరి కావడంతో వాహనదారుల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్ల ఇంజిన్లు ఈ మార్పును తట్టుకోలేవని.. దీనివల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇవన్నీ వదంతులని కొట్టిపారేస్తూ.. కేవలం మైలేజీ విషయంలో మాత్రమే స్వల్ప మార్పు ఉంటుందని డిప్లమాటిక్ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ వెర్షన్ ప్రకారం E20 ఇంధనం వల్ల పవర్ లేదా టార్క్ తగ్గుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. రబ్బర్లు, గాస్కెట్లు పాడవుతాయనే వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. పైగా ఈ ఇంధనం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. మైలేజ్ త‌ప్ప ఇంకేదీ స‌మ‌స్య కాద‌ని అనేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్న నివేదికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం వాహనదారులను అయోమయంలో పడేస్తోంది.

ప్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.. పాత వాహనాలకు E20 వల్ల ముప్పు పొంచి ఉందనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన వాహనాలు ఈ ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకునేలా రూపొందించలేద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇథనాల్‌కు తేమను ఆకర్షించే స్వభావం ఉండటం వల్ల పాత ఇంజిన్లలోని లోహ భాగాలు తుప్పు పట్టే అవకాశం ఉంది. అలాగే ఇథనాల్ ఒక ద్రావణి వలె పనిచేయడం వల్ల పాత వాహనాల్లోని రబ్బరు గొట్టాలు, సీల్స్ కరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మైలేజీ విషయంలోనూ వినియోగదారులపై భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మైలేజీ 6 నుండి 10 శాతం వరకు తగ్గే వీలుంది. దీనివల్ల పెట్రోల్ ధర తక్కువగా ఉన్నా కానీ.. కిలోమీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చు మాత్రం పెరుగుతుంది. అంతేకాకుండా.. ఇంధనం ఎక్కువ కాలం ట్యాంకులో ఉంటే నీటితో కలిసి `ఫేజ్ సెపరేషన్`కు గురై ఇంజిన్‌ను మొరాయించేలా చేస్తుందని.. చలికాలంలో కోల్డ్ స్టార్ట్ సమస్యలు తలెత్తుతాయని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చివరగా BS6 ఫేజ్-2 వాహనాలు ఉన్న వారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. దేశంలోని మెజారిటీ వాహనదారులకు తమ బండి E20 కి సహకరిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. తయారీదారులు సూచించిన దానికంటే ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనం వాడితే వారంటీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రీప్రెస్ జ‌ర్న‌ల్ పేర్కొంది. ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ఈ అడుగు వేసినా.. పాత వాహనాల యజమానులకు నిర్వహణ భారం పెరగకుండా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటివరకు ఈ మైలేజీ డ్రాప్ వెనుక దాగి ఉన్న ఇతర సాంకేతిక సవాళ్లు వాహనదారులను వేధిస్తూనే ఉంటాయి. ప్ర‌స్తుతం ఇరాన్ వ‌ర్సెస్ ఇజ్రాయేల్-అమెరికా వార్ నేప‌థ్యంలో ఆయిల్, గ్యాస్ స‌మ‌స్య‌లు గోరు చుట్టు మీద రోక‌టి పోటు మాదిరి త‌యార‌య్యాయి. అందువ‌ల్ల ప్ర‌పంచానికి ఇథ‌నాల్ పెట్రోల్ త‌ప్ప ఇంకే దిక్కు లేద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది.