ఖమేనీ హత్యపై భారత్ మౌనం...వ్యూహాత్మకం
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారతదేశం మౌనం వహించడం మీద రకరకాలైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
By: Satya P | 3 March 2026 9:00 PM ISTఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారతదేశం మౌనం వహించడం మీద రకరకాలైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇది ఖండించాల్సిన విషయం కదా అని అంటున్న వారు ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అయితే ఇదే అంశాన్ని ముందు పెట్టి ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించాల్సిన ప్రభుత్వం మౌనం వహించడం మీద ఆమె ఫైర్ అయ్యారు. ఇది అత్యంత బాధ్యతా రాహిత్యం అని కూడా ఆమె అన్నారు. తటస్థ విధానం అంటే ఇది కాదని అన్నారు. విదేశాంగ విధానంలో ఇది ఒక బాధ్యత లేని తనంగా ఆమె అభివర్ణించారు. చర్చలు ఒక వైపు జరుగుతున్న సమయంలో ఏకంగా ఒక దేశాధినేత మీద దాడి చేసి చంపడం అన్నది ఇంటర్నేషనల్ గా చూసినా నిబంధనలకు విరుద్ధం అని ఆమె అన్నారు. ఈ అంశం మీద బడ్జెట్ సమావేశాలలో చర్చ జరగాల్సిందే అని కూడా సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్ చేసింది :
ఇదిలా ఉంటే బీజేపీ నేతలు సైతం గతాన్ని తవ్వుతున్నారు. యూపీయే వన్ యూపీయే టూ ప్రభుత్వాలు ఉన్నపుడు కాంగ్రెస్ చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు లిబియాలోని గడాఫీ వంటి నియంతృత్వ పాలనకు మద్దతు ఇవ్వకుండా అమెరికా నేతృత్వంలోని దళాల వైపు నిలిచిన సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం 2005, 2006 2009లలో చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తు చేస్తున్నారు.
గడాఫీ హత్య సమయంలో :
ఇక ఒక్కసారి వెనక్కి చూస్తే కనుక 2011లో లిబియా నియంత గడాఫీని చంపబడినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం అధికారిక సంతాపం ఎందుకు ప్రకటించలేదని బీజేపీ వైపు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు 2011లో నాటో బాంబు దాడిలో గడాఫీ మరణించినప్పుడు నాటి యూపీఏ ప్రభుత్వం కనీసంగా కూడా స్పందన లేదని అంటున్నారు. మరి అప్పుడు యూపీయే తప్పు చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ఇపుడు మోడీ ప్రభుత్వం తప్పు చేసినట్లే భావించాలని దౌత్య నిపుణులు అంటున్నారు.
దౌత్య పరమైన అంశాలు :
ఏ దేశం అయినా దౌత్యపరమైన అంశాల మీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని అంటున్నారు. అంతే కాదు అన్నింటి కంటే ఎక్కువగా తన జాతీయ ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలన్న దానినే కేంద్రం ఎంచుకుందని దౌత్య నిపుణులతో పాటు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఈ అంశాల మీద భారతదేశం ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నిర్ణయించుకుందని అంటున్నారు. జాతీయ ప్రయోజనం, ప్రాంతీయ స్థిరత్వం పౌరుల భద్రతను అంచనా వేయడం ఆధారంగానే ఇవన్నీ జరుగుతాయి తప్పించి మౌనం అంటే అది నిశ్శబ్దం కాదని, అది రాజ్య నైపుణ్యమని చెబుతున్నారు.
భారత్ విషయంలో ఇరాన్ వైఖరి :
ఇదిలా ఉంటే భారత్ విషయంలో ఖమేనీ పాలనలో ఇరాన్ వైఖరిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. ఖమేనీ పాలన భారతదేశ జాతీయ విషయాలలో తరచూ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని ప్రస్తావిస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఖమేనీ భారతదేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడారని అంటున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక అభిప్రాయాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా భారత్ ని ఒంటరిగా చేయడానికి ఖమేనీ ప్రయత్నించారని అంటున్నారు.
కాశ్మీర్ ఇష్యూ నుంచి :
ఇక కాశ్మీర్ ఇష్యూ నుంచి మొదలెడితే ఢిల్లీ అల్లర్ల వరకూ ఇరాన్ అనుసరించిన వైఖరి భారత్ వ్యతిరేకంగానే ఉంది అంటున్నారు. దేశంలో హిందువులపై జరుగుతున్నా హింసను విస్మరించి కాశ్మీర్ సహా అనేక అంశాలలో ఏకపక్ష వైఖరినే ఖమేనీ అనుసరించారు అని అంటున్నారు. ఒక సమయంలో భారతదేశాన్ని గాజాతో ఆయన పోల్చారని మరి ఇది ముస్లిం దేశాలను రెచ్చగొట్టడానికి అలాగే భారతదేశాన్ని దౌత్యపరంగా ఒంటరిగా చేయడానికి స్పష్టంగా రూపొందించబడిన విధానం కాదా అని అంటున్నారు.
పాక్ పట్ల సానుభూతి :
అంతే కాదు 2017లో ఖమేనీ కాశ్మీర్‌లో అణచివేయబడిన ముస్లింలు అంటూ వ్యాఖ్యానించారని చెబుతున్నారు. ఇక ఆర్టికల్ 370 అలాగే సీఏఏ గురించి కూడా ఖమేనీ మాట్లాడారని అంటున్నారు. 2008లో జరిగిన భయంకరమైన ముంబై దాడుల తర్వాత కూడా ఖమేనీ ప్రతిస్పందన భారతదేశానికి వ్యతిరేకంగా నిరాశ పరచే విధంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇరానియన్ మీడియా వ్యాఖ్యానంలోని కొన్ని విభాగాలు చూస్తే కనుక ఖమేనీ పాలనలో ఎపుడూ పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నట్లుగా ఉందని చెబుతున్నారు. ఒక ఇరాన్ అధికారి ఉగ్రవాదులు పాకిస్తాన్ నేల నుండి వచ్చారని స్పష్టంగా అంగీకరించకుండాపాకిస్తాన్‌ను ఉగ్రవాద బాధితురాలిగా అభివర్ణించారని గుర్తు చేస్తున్నారు.
కేంద్రం వైఖరి ఇలా :
ఇక మరోవైపు పశ్చిమాసియాలో శత్రుత్వాలు చెలరేగుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని పశ్చిమాసియాలోని గల్ఫ్ సహచరులతో మాట్లాడి సంఘీభావం తెలిపాని అంటున్నారు. సాయుధ ఘర్షణను త్వరగా ముగించాలని చర్చలు శరన్యం అన్నది భారత్ విధానం అని చెబుతున్నారు.
