శత్రువుకు బ్యాడ్ న్యూస్... భారత్ అమ్ములపొదిలో నెక్స్ట్ జన్ ఆయుధాలు!
అవును... ఈ ఏడాది చివరి నాటికి 'ధ్వని' పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు డీ.ఆర్.డీ.ఓ. సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
By: Raja Ch | 16 Oct 2025 5:00 AM ISTరక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్.జీ.వీ) "ధ్వని" పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) ప్రయత్నిస్తుంది!
అవును... ఈ ఏడాది చివరి నాటికి 'ధ్వని' పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు డీ.ఆర్.డీ.ఓ. సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ధ్వని వేగానికి సుమారు ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ 'ధ్వని' క్షిపణులు ప్రయాణించగలవని, ఫలితంగా సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలవని చెబుతున్నారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించగలవని అంటున్నారు.
వాస్తవానికి హైపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుందని.. రాకెట్ సాయంతో ఎత్తుకు వెళ్లి, అక్కడ నుంచి విడిపోయి హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యంవైపు దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి గ్రౌండ్, ఫ్లైట్ పరీక్షలు చేసింది.
ఈ క్షిపణులు గంటకు సుమారు 7,400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా వేస్తున్నారు!
ఇండియా - ఇజ్రాయెల్.. 'స్కై స్టింగ్'!:
భారతదేశ స్వదేశీ యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచే చర్యలో భాగంగా... ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్, హె.ఏ.ఎల్. తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్ తో అనుసంధానం కోసం దాని నెక్స్ట్ జనరేషన్ స్కై స్టింగ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి (బీ.వీ.ఆర్.ఏ.ఏ.ఎం)ను అందించింది. ఈ స్కై స్టింగ్.. 250 కిలోమీటర్ల వరకు నివేదిత నిఘా పరిధితో, దీర్ఘ శ్రేణి వైమానిక పోరాటం కోసం రూపొందించబడింది.
ఈ క్షిపణిని ప్రవేశపెట్టినట్లయితే.. చైనా వద్ద ఉన్న పీఎల్-15 క్షిపణి వంటి అధునాతన శత్రు ఆయుధాలను ఎదుర్కోవడంలో తేజస్ ఎంకే1ఏకి అడ్వాన్సుగా ఉంటుంది. ఈ విమానం ఈ.ఎల్.ఎంరాడార్-2052 ఏ.ఈ.ఎస్.ఏ రాడార్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (డీ.ఎఫ్.సీ.సీ.) కారణంగా తేజస్ ఎంకే1ఏ తో స్కై స్టింగ్ అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
ఈ ఇజ్రాయెల్ బీ.వీ.ఆర్.ఏ.ఏ.ఎం పరిచయం భారతదేశ స్వదేశీ ఆస్ట్రా ఎంకే3 క్షిపణి కార్యక్రమంలో జాప్యాల మధ్య సామర్థ్య అంతరాలను తగ్గించడంలో సహాయపడుతుందని.. అదే సమయంలో పెరుగుతున్న భారతదేశం – ఇజ్రాయెల్ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
