Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌కు గట్టి షాక్.. టెర్రర్ నెట్‌వర్క్‌లపై కేంద్రం ఉక్కుపాదం

భారత్‌కు వ్యతిరేకంగా సరిహద్దుల అవతల నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపింది

By:  A.N.Kumar   |   4 July 2026 11:59 PM IST
పాకిస్థాన్‌కు గట్టి షాక్..  టెర్రర్ నెట్‌వర్క్‌లపై కేంద్రం ఉక్కుపాదం
X

దేశ సార్వభౌమత్వం, అంతర్గత భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా సరిహద్దుల అవతల నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 23 మందిని అధికారికంగా 'ఉగ్రవాదులు'గా ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్-35 కింద వీరిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు వెల్లడించింది.

కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఉన్న వారంతా జైషే మహ్మద్ , లష్కరే తోయిబా , జమాత్-ఉద్-దవా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరిలో 17 మంది పాకిస్థాన్ పౌరులు కాగా, ఆరుగురు భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వీరు పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో తలదాచుకుని భారత్‌పై ఉగ్రకుట్రలు పన్నుతున్నట్లు నిఘా సంస్థలు తెలిపాయి.

డ్రోన్‌ల ద్వారా సరిహద్దుల్లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించడం, కొత్త ఉగ్రవాదులను రిక్రూట్ చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరించడం, జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల కదలికలపై నిఘా ఉంచడం వంటి కీలక బాధ్యతలను ఈ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ జాబితాలోని పలువురికి గతంలో దేశంలో జరిగిన ప్రధాన ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా 2016లో నగ్రోటా ఆర్మీ క్యాంప్‌పై జరిగిన దాడి, 2022లో జమ్మూలోని సుంజ్వాన్ సమీపంలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది.

జాబితాలో జైషే మహ్మద్‌కు చెందిన మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, మహ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, హఫీజ్ అబ్దుల్ షకూర్, లష్కరే తోయిబాకు చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్, బిలాల్ అహ్మద్ మీర్ వంటి కీలక పేర్లు ఉన్నాయి. అలాగే అల్‌ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న మహ్మద్ షహీద్ ఫైసల్‌ను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.

ఈ ప్రకటనతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహా ఇతర దర్యాప్తు సంస్థలకు ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, స్థిర-చరాస్తులను జప్తు చేయడం, విదేశాల నుంచి వచ్చే నిధులను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టే చట్టబద్ధమైన అధికారం లభిస్తుంది. టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్‌వర్క్‌లను బలహీనపరచడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.

సరిహద్దుల అవతల నుంచి భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. ఈ తాజా నిర్ణయం ద్వారా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న వర్గాలపై అంతర్జాతీయ స్థాయిలో మరింత ఒత్తిడి పెరగడంతో పాటు.. దేశ భద్రతను బలోపేతం చేసే దిశగా ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.