Begin typing your search above and press return to search.

ఒకే నెలలో ₹2.17 లక్షల కోట్లు క్రెడిట్‌ కార్డ్‌లతో గీకేశారు!

ఈ భారీ వృద్ధి వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి అందించిన ప్రత్యేక పండుగ సీజన్ ఆఫర్లు.

By:  A.N.Kumar   |   9 Nov 2025 10:31 AM IST
ఒకే నెలలో ₹2.17 లక్షల కోట్లు క్రెడిట్‌ కార్డ్‌లతో గీకేశారు!
X

డబ్బులు ఊరికే రావు అని ఓ వ్యాపార పెద్ద మనిషి ఉచిత సలహా ఇచ్చాడు.కానీ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు మాత్రం క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తూ ‘డబ్బులు ఊరికే ఖర్చు చేయండి’ అంటూ ప్రోత్సహిస్తున్నాయి. దీంతో జనాలు అవసరాల కోసం క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తూ వాటిని కట్టలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడు దేశంలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు రికార్డ్ స్థాయిలో వృద్ధి చెందడానికి ఈజీగా మనీ రావడం కూడా కారణంగా చెప్పొచ్చు.

భారతదేశంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్‌ 2025లో క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా జరిగిన ఖర్చులు 23 శాతం వృద్ధితో ఏకంగా ₹2.17 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2020 తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.

పెరుగుదలకు కారణాలు

ఈ భారీ వృద్ధి వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి అందించిన ప్రత్యేక పండుగ సీజన్ ఆఫర్లు. పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసం డిమాండ్ కూడా ఈ వృద్ధికి కారణంగా చెప్పొచ్చు. ఇక కేంద్రం తాజాగా ఖర్చులపై జీఎస్టీ తగ్గింపు కూడా ఈ వృద్ధికి దోహదపడింది.

కార్డుల సంఖ్య.. సగటు వ్యయం పెరుగుదల

సెప్టెంబర్‌ 2025 నాటికి దేశంలో మొత్తం క్రెడిట్‌ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్‌ 2024లో 10.6 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య, ప్రస్తుతం 11.3 కోట్లకు చేరింది. ఇది దేశవ్యాప్తంగా క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం పెరుగుతోందనడానికి స్పష్టమైన సూచన. ప్రైవేట్‌ బ్యాంకులు సగటు కార్డ్‌ ఖర్చు ₹20,011 గా నమోదై ఏడాదిలో 3% వృద్ధిని చూపింది.ప్రభుత్వ రంగ బ్యాంకుల వృద్ధి మరింత ఎక్కువగా ఉంది. ప్రతి కార్డుపై ఖర్చు 30% పెరిగి ₹16,927 కు చేరుకుంది.

మార్కెట్‌లో బ్యాంకుల వాటా

క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్లో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. సెప్టెంబర్‌ 2025లో మొత్తం ఖర్చుల్లో 74.2% వాటాను సాధించాయి. అయితే ఇది ఏడాది క్రితం కంటే కొంచెం తగ్గింది. పబ్లిక్‌ రంగ బ్యాంకుల వాటా 18.4% నుంచి 21.2% కి పెరిగింది. పెద్ద ప్రభుత్వ బ్యాంకుల కారణంగా ఈ వృద్ధి నమోదైంది.

రుణ వృద్ధిలో మందగమనం

ఆసక్తికరంగా మొత్తం క్రెడిట్‌ కార్డ్‌ ఖర్చులు పెరిగినప్పటికీ క్రెడిట్‌ కార్డ్‌ బకాయిల వృద్ధి మాత్రం మితంగా ఉంది. సెప్టెంబర్‌ 2025 నాటికి దేశంలో మొత్తం క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు ₹2.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది ఏడాదిలో 3.7% మితమైన వృద్ధిని మాత్రమే సూచిస్తోంది. మొత్తం రిటైల్‌ లోన్లలో క్రెడిట్‌ కార్డ్‌ బకాయిల వాటా 4.9% నుంచి 4.5% కు తగ్గింది. అంటే ఇతర రిటైల్‌ లోన్‌ విభాగాలు మరింత వేగంగా వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది.

మొత్తం మీద వినియోగదారుల నమ్మకం.. బ్యాంకుల ఆకర్షణీయమైన ఆఫర్లు కలిసి భారతదేశంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి.