ట్రంప్ ఎంత మొత్తుకున్నా.. భారత్ చేసే పని చేస్తోందే?
రిఫైనరీల అనుకూలత: భారత రిఫైనరీలు (ముఖ్యంగా రోస్నెఫ్ట్‌తో కలసి ఉన్న నయారా ఎనర్జీ వంటి సంస్థలు) రష్యన్ గ్రేడ్ చమురును ప్రాసెస్ చేయడానికి సాంకేతికంగా సన్నద్ధంగా ఉన్నాయి.
By: A.N.Kumar | 16 Oct 2025 3:15 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన హెచ్చరికలు, సుంకాలను బేఖాతరు చేస్తూ భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ కెప్లెర్ (Kpler) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ నెలలో భారత్‌కు అత్యధికంగా ముడి చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
రష్యా చమురుపై భారత్ ఆధారపడటానికి ప్రధాన కారణాలు
తక్కువ ధర: పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రష్యా చమురును భారీ డిస్కౌంట్‌లతో విక్రయిస్తోంది. భారత్ వంటి పెద్ద వినియోగదారుడు దేశానికి ఇది చాలా లాభదాయకం.
ఎనర్జీ భద్రత: భారత్ రోజుకు 50 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును వినియోగిస్తుంది. దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో, విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా సరఫరా భద్రతను నిలబెట్టుకోవచ్చు.
డాలర్ ఒత్తిడిని తగ్గించడం: రష్యా-భారత్ చమురు లావాదేవీలు కొంతమేర రూపీ లేదా యువాన్ ద్వారా జరుగుతున్నాయి. దీని వల్ల అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని భారత్ తగ్గిస్తోంది.
జియోపాలిటికల్ స్వతంత్రత: భారత్ "స్ట్రాటజిక్ ఆటానమీ" విధానం పాటిస్తోంది..అంటే, ఎవరి ఒత్తిడికీ లోబడకుండా, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం. ట్రంప్ ( అమెరికా) హెచ్చరికలు ఉన్నప్పటికీ, భారత్ తన ఆర్థిక అవసరాలు, ఇంధన భద్రత దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటోంది.
రిఫైనరీల అనుకూలత: భారత రిఫైనరీలు (ముఖ్యంగా రోస్నెఫ్ట్‌తో కలసి ఉన్న నయారా ఎనర్జీ వంటి సంస్థలు) రష్యన్ గ్రేడ్ చమురును ప్రాసెస్ చేయడానికి సాంకేతికంగా సన్నద్ధంగా ఉన్నాయి.
కీలక గణాంకాలు
సెప్టెంబర్‌లో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో 34 శాతం వాటా రష్యాదే. ఈ నెలలో రష్యా నుంచి భారత్ రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్లు చమురును కొనుగోలు చేసింది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో రష్యా నుంచి దిగుమతులు స్వల్పంగా 70,000 బ్యారెళ్లు పెరిగాయి. రష్యా కేవలం జూలై నెలలోనే భారత్‌కు సుమారు $3.6 బిలియన్ డాలర్ల (దాదాపు ₹31,775 కోట్ల) విలువైన చమురును విక్రయించింది.
సెప్టెంబర్‌లో దిగుమతులు పెరిగినప్పటికీ, ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న సగటుతో పోలిస్తే 1.8 లక్షల బ్యారెళ్లు తక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ తగ్గుదలకు అమెరికా ఒత్తిడితో ఎలాంటి సంబంధం లేదని కెప్లెర్ స్పష్టం చేసింది. ఈ స్వల్ప హెచ్చుతగ్గులు అంతర్జాతీయ మార్కెట్ డైనమిక్స్‌లో చోటుచేసుకున్న మార్పుల వల్లేనని నివేదిక పేర్కొంది.
ఇతర ప్రధాన సరఫరాదారులు
ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో 34% వాటాతో రష్యా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు ఉన్నాయి. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో చౌకగా లభిస్తున్న రష్యా చమురు కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా నుండి పదేపదే ఒత్తిడి , సుంకాల బెదిరింపులు ఉన్నప్పటికీ, దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ధర ఆధారిత కొనుగోలు వ్యూహాన్ని భారత్ కొనసాగిస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు మరింతగా కొనుగోలు చేస్తూనే ఉంది.
