టెన్షన్ తెచ్చే రిపోర్టు.. చలికాలం తగ్గుతోంది.. వేడి తీవ్రత పెరుగుతోంది
వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన ఒక రిపోర్టు ఇప్పుడు బయటకు వచ్చింది.
By: Garuda Media | 13 April 2026 1:00 PM ISTవాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన ఒక రిపోర్టు ఇప్పుడు బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే గణాంకాలు ఇప్పుడు ఆందోళనకు గురి చేసేలా మారాయి. ఉష్ణోగ్రతలను తగ్గించి వాతావరణాన్ని చల్లగా మార్చే లానినో ప్రభావం ఉన్నప్పటికీ.. గ్లోబల్ వార్మింగ్ దానిని అధిగమిస్తోంది. దీంతో 2026లో శీతాకాలం ముందుగానే ముగిసిపోయి.. ఫిబ్రవరిలోనే వేడిగాలులు మొదలైన విసయాన్ని తాజాగా క్లైమేట్ ట్రెండ్స్ రిపోర్టు వెల్లడించింది.
2025లోనూ ఫిబ్రవరిలో శీతాకాలం ఆకస్మికంగా ముగిసిపోయి.. దేశ వ్యాప్తంగా సాధారణాన్ని మించిన అధిక ఉష్ణోగ్రతలు మొదలైనట్లుగా పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరిలో ఈ ఏడాది వర్షపాతం లోటు 81 శాతంగా నమోదైంది. శీతాకాలం క్షీణత ఎంతన్న విషయాన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్.. మే లో మొదలయ్యే వేడిగాలులు ఈసారి మార్చి నెలలోనే కనిపించటం ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా క్లైమేట్ ట్రెండ్స్ రిపోర్టు వెల్లడించింది. తన వాదనకు నిదర్శనంగా పలు అంశాల్ని ఈ రిపోర్టు వెల్లడించింది. ఉత్తర.. మధ్య భారతదేశంలో ముందుగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు పెరిగాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం ఉంది.
మారిన వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపటమే కాదు.. నీటి అవసరాన్ని కూడా పెంచుతోందని వెల్లడించింది. ఏసీలు.. కూలర్లతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది. 1901 తర్వాత 2025 ఎనిమిదో అత్యధిక ఉష్ణోగ్రతల ఏడాదిగా నమోదైందన్న విషయాన్ని వెల్లడించిన రిపోర్టు.. ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమ కూడా పెరగటంతో వెట్ బల్బ్ టెంపరేచర్ స్థాయిలు పెరుగుతున్నాయి. శరీరం చెమట ద్వారా చల్లబడే సామర్థ్యం తగ్గిపోతోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు.. మెట్రో నగరాల్లో హీట్ స్ట్రెస్.. డీహైడ్రేషన్.. వడదెబ్బ లాంటి అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. పెద్ద వయస్కులు.. చిన్నపిల్లలు.. బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారు ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది’’ అని రిపోర్టు పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్ తో లానినో (శీతల) ప్రభావం పెద్దగా కనిపించటం లేదన్న నివేదిక..గడిచిన పదకొండేళ్ల కాలంలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను చూపిస్తోందని పేర్కొంది. ముంబయిలో మార్చి 10న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 7.6డిగ్రీలు ఎక్కువ. ఢిల్లీలో నమోదయ్యే గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఇది సాధారణం కంటే 5-7 డిగ్రీలు ఎక్కువ. దేశ వ్యాప్తంగా ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం 22.7 మి.మీ. అయితే 2025 ఫిబ్రవరిలో నమోదైన వర్షపాతం కేవలం 4.2 మి.మీ. మాత్రమే. ఈ పరిస్థితులను చూస్తే.. రానున్న కాలంలో వేడి తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని రిపోర్టు స్పష్టం చేస్తోంది.
