Begin typing your search above and press return to search.

ప్రవర్తనలో మనం ఎక్కడున్నాం.. బిహార్ కంటే ఇంత దారుణమా..?

ఇండియా టుడే భారత్ లోని అన్ని రాష్ట్రాల సివిక్ బిహేవియర్ (పౌరుల ప్రవర్తన)పై ఒక సర్వే నిర్వహించింది.

By:  Tupaki Political Desk   |   25 Oct 2025 4:00 PM IST
ప్రవర్తనలో మనం ఎక్కడున్నాం.. బిహార్ కంటే ఇంత దారుణమా..?
X

ఇండియా టుడే భారత్ లోని అన్ని రాష్ట్రాల సివిక్ బిహేవియర్ (పౌరుల ప్రవర్తన)పై ఒక సర్వే నిర్వహించింది. ఈ మీడియా దిగ్గడం రాష్ట్రాల్లోని పౌరులతో మాట్లాడుతూ ఈ సర్వే చేసినట్లు చెప్పింది. దీనికి సంబంధించి వివరాలను మ్యాప్ ద్వారా ‘X’లో పోస్ట్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ఇండియా సివిక్‌ సర్వే-2025 దేశ ప్రజల సాంఘిక ప్రవర్తనను ఒక అద్దంలా చూపించింది. ఈ సర్వేలో భారత్ లోని రాష్ట్రాలను ‘సివిక్‌ బిహేవియర్‌’ అంటే చెత్త వేయడం, టికెట్‌ లేకుండా ప్రయాణించడం, ఇతరులకు సహాయం చేయడం వంటి సామాజిక ప్రవర్తనల ఆధారంగా ర్యాంక్‌ చేసినట్లు సంస్థ పేర్కొంది. ఆశ్చర్యకరంగా, విద్య, సాంకేతికత, ఆర్థిక అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకంటే వెనుకబడిన రాష్ట్రాలు ఈ సర్వేలో మెరుగైన స్థానాలు సాధించాయి. అంటే, అభివృద్ధి పెరిగినా మనసు తగ్గిందా అన్న ప్రశ్నకు ఇది ఒక ప్రతిబింబం.

బిహార్‌ లో ఆశ్చరకరమైన ఫలితాలు..

బిహార్ అంటే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది. అల్లర్లు, రౌడీ గ్యాంగులు కానీ సివిక్ బిహేవియర్ లో రాష్ట్రం కర్ణాటక, తెలంగాణ కంటే ముందు నిలవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ సర్వేలో బిహార్‌ 10వ స్థానంలో నిలవగా.. కర్ణాటక 18, తెలంగాణ 19వ స్థానాల్లో ఉన్నాయి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే బిహార్‌ అంటే మనకు గుర్తొచ్చేది రాజకీయ గందరగోళం, అభివృద్ధిలో వెనుకబాటు, సామాజిక అసమానతలు. కానీ అదే బిహార్‌ సివిక్‌ విలువల్లో ముందుంటే.. ఆధునిక ఐటీ హబ్‌లుగా నిలిచిన హైదరాబాద్‌, బెంగళూరులు వెనుకపడడం ఆలోచించాల్సిన విషయం.

ఇది ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. సౌకర్యాలు ఉంటే సంస్కారం ఉండదని, టెక్నాలజీలో ముందున్నా.. బిహేవియర్ లో మాత్రం వెనుక ఉన్నాయి. బిహార్‌ ప్రజలు ఇంకా సామాజిక బంధాలను, పరస్పర సహకారాన్ని ఎక్కువగా విలువైనవిగా చూస్తారు. మరోవైపు, నగర జీవనపు ఆత్మకేంద్రీకరణ మనిషిని ఒంటరిగా మార్చింది.

దక్షిణ భారతంలో పాఠం..

సర్వేలో మొదటి స్థానంలో పుదుచ్చేరి, రెండో స్థానంలో ఒడిశా, మూడు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు 5వ స్థానంలో ఉండగా.. కానీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం. ఇవే రాష్ట్రాలు విద్య, ఐటీ, ఉద్యోగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. కానీ సివిక్‌ బిహేవియర్‌లో అంటే ఇతరుల పట్ల గౌరవం, పబ్లిక్‌ ప్రదేశాల పట్ల బాధ్యత, సమాజం పట్ల శ్రద్ధలో వెనుకబడటం ఆలోచనీయమైంది.

హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లో రోజు రోజుకు వ్యక్తిగత స్వార్థం పెరుగుతోంది. రోడ్లపై చెత్త వేయడం, ట్రాఫిక్‌ నియమాలు పట్టించుకోకపోవడం, పబ్లిక్‌ ప్రాపర్టీని ధ్వంసం చేయడం.. ఇవన్నీ ‘సివిక్‌ ప్రవర్తన’ లోపాలే. ఈ సర్వే కేవలం గణాంకం కాదు.. ఇది నగర మనస్తత్వానికి అద్దం పడుతోంది.

బిహార్‌ ఎందుకు మెరుగ్గా..

బిహార్‌లో ఇంకా పట్టణీకరణ పూర్తిగా విస్తరించలేదు. అక్కడ సమాజం పాత విలువలను, కుటుంబ బంధాలను గౌరవిస్తోంది. చిన్న పట్టణాల్లో పరస్పర సహాయం, పొరుగువారిపై శ్రద్ధ కనిపిస్తుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నా.. మనుషుల మధ్య సంబంధాలు మిగిలి ఉన్నాయి. ఇది బిహార్‌ ర్యాంక్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాదు, బెంగళూరు వెనుక ఎందుకు..?

ఒకప్పుడు ‘అతిథి దేవోభవ’ అని చెప్పుకునే మన సమాజం ఇప్పుడు ‘మై టైమ్‌, మై స్పేస్‌’గా మారిపోయింది. మెట్రోపాలిటన్‌ జీవితం మనిషిని మరింత వ్యక్తిగతంగా, మరింత అనాసక్తంగా మార్చింది. ఫ్లాట్లలో వంద మంది ఉండి, ఒకరి పేరు మరొకరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. సివిక్‌ విలువలు అంటే కేవలం చెత్త వేయకపోవడం కాదు.. అది మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల కర్తవ్య భావం.

సామాజిక మార్పుకు సమయం

ఈ ర్యాంకింగ్స్‌ ఒక పాఠం చెబుతోంది. అభివృద్ధి భవనాల్లో కాదు.. ప్రవర్తనలో కొలవాలి. బిహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు మనకు చెప్పే సందేశం ఇదే. వీరి వద్ద మాల్స్‌ ఉండకపోయినా.. మనసు ఉంది. నగరాల్లో టవర్స్‌ ఉన్నా.. సంబంధాలు లేవు.

భారతదేశం 5G, AI, స్మార్ట్‌ సిటీస్‌ వైపు పరుగులు తీస్తోంది. కానీ మనం పక్కన ఉన్న మనిషికి సాయం చేయడం మర్చిపోతే.. ఆ అభివృద్ధి పాతాళానికి వెళ్లినట్లే.. సివిక్‌ బిహేవియర్‌ మ్యాప్‌ మనకు ఒక హెచ్చరిక ‘మీరు ప్రపంచాన్ని గెలుచుకోగలరు, కానీ ఒక చిరునవ్వు పంచుకోవడంలో విఫలమవుతున్నారు’ అన్నట్లు కనిపిస్తోంది. ఇక మనం ‘స్మార్ట్‌ సిటీ’ల నుంచి ‘సెన్సిబుల్‌ సిటీ’ల వైపునకు అడుగు వేయాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు.. అది మన ప్రవర్తన, మనసు, మన సమాజ పట్ల శ్రద్ధ. బీహార్‌ మనకు నేర్పింది ఇదే: సంస్కారం ఉంటేనే సమాజం నిలుస్తుంది, లేకుంటే సాంకేతికత కేవలం యంత్రం మాత్రమే.