నదుల పక్కన ఉన్న నగరాల్లో భూమి కుంగుతోంది !
భూమి కుంగిపోతోంది. భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.
By: A.N.Kumar | 11 Jan 2026 6:00 PM ISTభూమి కుంగిపోతోంది. భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. అందుకు భారతదేశం మినహాయింపు కాదు. మన దేశంలోనూ చెన్నై, కోల్ కత, అహ్మదాబాద్ నగరాల్లో భూమి రానురాను కుంగుతోంది. ఫలితంగా వరద ముంపునకు గురయ్యే ప్రమాద తీవ్రత పెరుగుతోంది. అది కూడా నదులు, సముద్రం పక్కనే ఉన్న నగరాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి కారణాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నప్పటికీ ... దాని దుష్ప్రభావం మాత్రం ఒక విధంగా ఉంది. భవిష్యత్ తరాలకు పెను సవాల్ విసురుతోంది. ఇప్పుడు మేల్కోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది.
దేశంలో నగర జనాభా పెరిగింది. భూగర్భజలాల వాడకం పెరిగింది. అదే సమయంలో వర్షం సరిగా కురవడం లేదు. ఫలితంగా భూమిలోపలి నీరు మొత్తం తోడేస్తున్నాం. ఆ నీరు మొత్తం తోడేయడంతో భూమి మధ్య పొరల్లో ఖాళీ ఏర్పడుతుంది. అదే సమయంలో భారీస్థాయి నిర్మాణాలతో భూమిపై ఒత్తిడి పెంచుతున్నాం. ఆ ఒత్తిడి కారణంగా భూమిలోని ఖాళీ పొరలు కుచించుకపోతున్నాయి. సముద్ర మట్టానికి కంటే ఎత్తులో ఉండాల్సిన నగరాలు.. కిందకు వెళ్తున్నాయి. వర్షాలు కురిస్తే ఆ వర్షం మొత్తం నగరాల్లోకి వస్తోంది. వరదలను నియంత్రించలేకపోతున్నాం.
ప్రమాదం అంచున నగరాలు
కోల్ కతాలో ప్రతి ఏటా 2.8 సెంటీమీటర్ల భూమి కుంగుతోంది. ఇది రానురాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణంగా భారీగా భూగర్బజలాలు తోడటం, అదే సమయంలో పెద్ద ఎత్తున నగరీకరణ జరగడం. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు తరుచూ వరద ప్రభావానికి గురవుతున్నాయి.
చెన్నై నగరంలో కూడా ప్రతి ఏటా భూమి కుంగిపోతోంది. ఇది చిన్నగా కనిపించినప్పటికీ రానురాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోల్ కతా కంటే వేగంగా ఇక్కడ భూమి కుంగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అహ్మదాబాద్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ప్రతి ఏటా నాలుగు సెంటీమీటర్ల భూమి కుంగుతోంది. ఇది అహ్మదాబాద్ ను భవిష్యత్తులో మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోంది. సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ లేకుంగా వేగంగా నగరం అభివృద్ధి చెందడం ప్రధాన కారణంగా నిలుస్తోంది.
నదులున్న .. రాష్ట్రంలోనే ఎందుకు ?
కోల్ కతా, అహ్మదాబాద్, చైన్నై.. ఇవి ఆయా రాష్ట్రాలకు రాజధానులు. వీటి పక్కనో, మధ్యలోనే నదులు, సుముద్రాలు ఉన్నాయి. అయినా భూగర్భజలాలు రీచార్జ్ అవ్వలేదు. ఇదొక ఆశ్చర్యం. మరోవైపు భూమి కుంగితే నదీ మట్టమో.. సముద్ర మట్టమో పైకి వెళ్తుంది. వరదలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వరదలు తరుచూ వస్తే నియంత్రణ కష్టం అవుతుంది. అలాగే పాత భవనాలు డ్యామేజీ అవుతాయి. వాటిని రిపేర్ చేయించాలంటే మరింత భారం అవుతుంది. భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.
ఏం చేయాలి ?
భూమి కుంగడం కొనసాగితే రోజువారీ జీవితాలు ప్రమాదంలో పడతాయి. దీర్ఘకాలంలో ప్రజల జీవనంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. భద్రత లేకుండా పోతుంది. వరదలను నియంత్రిచలేము. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు జరగకుండా చూడాలి. నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీరాలను రక్షించాలి. చెట్ల పెంపకంపైన అవగాహన తీసుకురావాలి. సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్దతులు ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నగర నిర్మాణాలు ఉండాలి.
