Begin typing your search above and press return to search.

భారత్ పై చైనా వాటర్ బాంబ్...తప్పదా...

బీజింగ్ చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టు వల్ల టిబెట్ ప్రాంతంలోని పలు తెగల ప్రజలు తమ పూర్వీకుల నివాసాలను వదులుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది.

By:  Tupaki Political Desk   |   18 Dec 2025 8:00 PM IST
భారత్ పై చైనా వాటర్ బాంబ్...తప్పదా...
X

భారత్ కు అటూ ఇటూ కత్తులు తప్పవు అన్నట్లుంది వ్యవహారం. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్ర పోకడల ఆగడాలు...మరోవైపు చైనా దురాక్రమణలు ఈ రెండింటి మధ్య జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకు సాగాలి. తాజాగా తెరపై మరో వివాదం రాజుకుంటోంది. చైనా బ్రహ్మపుత్ర నదిపై విద్యుదుత్పత్తిని భారీగా చేపట్టేందుకు స్కెచ్ వేస్తోంది. దీనివల్ల భారత్ కు ప్రమాదం పొంచి ఉంది. భారత్ బంగ్లాదేశ్ లలో ప్రవహిస్తూ కోట్లాదిమందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నది నడకనే మార్చేసేందుకు చైనా సిద్దమైంది. ఈ నదిపై నిర్మించేందుకు సిద్ధమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వల్ల చైనాకు లాభం మాట అటుంచి దిగువ ప్రాంతాలకు పెనుముప్పు వాటిల్లనుంది. నదీ నడకనే మార్చేసే ప్రయత్నం వల్ల పర్యావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనకు అది బ్రహ్మపుత్ర నది...టిబెట్ లో యార్లంగ్ త్సాంగ్పో...పేరు మారినా...ప్రమాదం ముంచుకొస్తున్నది నది నైసర్గిక స్వరూపానికే. ఈ నదిపై బీజింగ్ దాదాపు 168 బిలియన్ల తో అంటే రూ.1,51,860 కోట్లతో భారీ జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇది పర్యావరణానికే కాకుండా భారత్ లాంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలకు భారీ ముప్పు తెస్తుంది. ప్రాజెక్టులో భాగంగా బారీ డ్యాములు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్తు కేంద్రాలను నిర్మించనున్నారు. నది ఎత్తులో 2000 మీటర్ల మేరకు మార్పు చేయాలని ప్రతయత్నిస్తోంది. దీంతో నదీ ప్రవాహ గతే మారిపోతుంది. ఫలితంగా అందులో సకల జీవరాశుల కదలికలు దెబ్బతింటాయని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నది దిగువ ప్రాంతంలో జీవవైవిద్యం, వ్యవసాయం ఘోరంగా మారిపోతాయని అంటున్నారు. ఒక దేశ అభివృద్ధి కోసం ఇతర దేశాల భూభాగాల్ని సహజవనరుల్ని దెబ్బతీయడం సరికాదని అంతర్జాతీయంగా ఆందోళన చెందుతున్నారు.

బీజింగ్ చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టు వల్ల టిబెట్ ప్రాంతంలోని పలు తెగల ప్రజలు తమ పూర్వీకుల నివాసాలను వదులుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఉపాధి వనరులు ఘోరంగా దెబ్బతింటాయి. ఇతర ప్రాంతాల కార్మికుల్ని ఇక్కడికి తరలించడం వల్ల స్థానికుల జీవనం ..వారి జీవన వనరులు ఘోరంగా మారిపోతాయని టిబెట్ పాలసీ ఇనిస్టిట్యూట్ విమర్శిస్తోంది. అలాగే చైనా చర్యల్ని అరుణాచల్ తదితర రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించి అభ్యంతరం చెబుతున్నాయి. ఇదే ప్రాజెక్టు నిర్మితమైతే చైనా ఎప్పుడు నీటిని వదులుతుందో...బంద్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. నీటిని విచక్షణారహితంగా వదిలితే వరదలు...వదలకుంటే కరవు సంభవిస్తాయి. ఈ రెండు సరిహద్దు రాష్ట్రాలకు ఇబ్బంది కరమే అని అధికారులు అంటున్నారు. ఓ రకంగా చైన చేతిలో వాటర్ బాంబ్ ఉన్నట్లే. అది ఎప్పుడు భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపై ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంటోంది.

ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు టిబెట్, భారత్ లపై రాజకీయ ఆధిపత్యానికి సంబంధించింది కూడా అన్న వాదన వినవస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో చైనా తన మౌలిక సదుపాయాలను భారీగా పెంచుకోవడం వల్ల సరిహద్దు దేశాలకు నిత్యం బెదిరింపు పరిస్థితి ఉత్పన్నమవుతుంటుంది. పైకి ఆ దేశ విద్యుదవసరాలకు ఏర్పాటు లాగా కనిపిస్తున్నా...ఇదో రాజకీయవ్యూహంలాగే చూడాల్సి ఉంటుంది. గతంలో మెకాంగ్ నది విషయంలోనూ చైనా ఇలాగే వ్యవహరిస్తోంది. అందుకే భారత్ మేల్కొని ముందస్తు చర్యలు చేపడుతోంది. చైనాకు దీటుగా బ్రహ్మపుత్రపైనే 11,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న భారీ డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది. ఇలా పోటీపోటీగా అటు చైనా ఇటు భారత్ బ్రహ్మపుత్ర నదిపై డ్యాములు నిర్మిస్తూ పోతే...వచ్చేది ప్రళయమే అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. ఈ అనారోగ్య కర పోటీ ఎంతదాక వెళుతుందో చూడాలి. మొత్తానికి మనపై వేసేందుకు చైనాచేతిలో వాటర్ బాంబు రెడీగా ఉందన్నది సత్యం.