కొత్త ఆర్థిక, విద్యా మంత్రులు.? కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?
ప్రస్తుతం సాగుతున్న ప్రచారంలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించినది.
By: A.N.Kumar | 26 Jun 2026 10:49 PM ISTదేశ రాజధానిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా వర్గాల్లో వస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే సోమవారమే కేంద్ర కేబినెట్ విస్తరణ లేదా శాఖల పునర్విభజన జరిగే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాష్ట్రపతితో అమిత్ షా భేటీ.. నిజమెంత?
ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తలకు బలం చేకూరుస్తూ ఒక ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కీలక సమావేశంలో కేబినెట్ మార్పులు, కొత్తగా చేరబోయే మంత్రుల జాబితాకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ భేటీకి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు?
ప్రస్తుతం సాగుతున్న ప్రచారంలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించినది. గత దాదాపు పదేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా నడిపిస్తున్న ఆమెకు.. ఈసారి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆమెను ఆర్థిక శాఖ నుంచి మానవ వనరులు లేదా విద్యా శాఖకు మార్చవచ్చని టాక్ నడుస్తోంది. అదే జరిగితే దేశానికి కొత్త ఆర్థిక మంత్రి ఎవరు కాబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై వేటు?
మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం తర్వాత ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడం.. శాఖ ప్రతిష్ట మసకబారడంతో ఈసారి ఆయనను మంత్రివర్గం నుంచే తప్పించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
మరికొన్ని కీలక శాఖల్లోనూ మార్పులు
కేవలం ఆర్థిక, విద్యా శాఖలే కాకుండా మరికొన్ని కీలక శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. కొందరు సీనియర్ మంత్రులకు శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది. మరికొందరు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని సమాచారం.
అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
ప్రస్తుతం సోషల్ మీడియా, జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ సమాచారం మొత్తం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చల ఆధారంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం గానీ, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం గానీ ఇప్పటివరకు ఎలాంటి లీకులు ఇవ్వలేదు.. అధికారికంగా స్పందించలేదు. కాబట్టి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
