భారత బుల్లెట్ ట్రైన్ తొలి పరుగు డేట్.. ఎంత దూరమంటే?
తొలుత అనుకున్నట్లుగా కాకుండా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బుల్లెట్ ట్రైన్ తొలుత వంద కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేయనుంది.
By: Garuda Media | 19 Nov 2025 2:02 PM ISTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత దేశ బుల్లెట్ ట్రైన్ కు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి.. తొలుత పరుగులు తీసే డేట్ మీద కేంద్ర రైల్వే శాఖా మంత్రి వివరాల్ని వెల్లడించారు. 2027 ఆగస్టులో భారత బుల్లెట్ ట్రైన్ తొలి పరుగు తీస్తుందని పేర్కొన్నారు. ఆగస్టులో పరుగులు తీయటమంటే.. కచ్ఛితంగా ఆగస్టు 15న ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తొలుత అనుకున్నట్లుగా కాకుండా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బుల్లెట్ ట్రైన్ తొలుత వంద కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేయనుంది. గతంలో సూరత్ నుంచి బిల్లిమోరా మధ్యనున్న యాభై కిలోమీటర్ల దూరానికే బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుందని పేర్కొన్నా.. దాన్ని ఇప్పుడు వంద కిలోమీటర్లకు పెంచుతున్నట్లుగా రైల్వే మంత్రి పేర్కొన్నారు.
దేశంలోని మొదటి హైస్పీడ్ రైలు మార్గాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబయి వరకు నిర్మిస్తున్నారు. వీటి మధ్య దూరం 508 కి.మీ.కాగా.. బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి మధ్య దూరాన్ని 2.17 గంటల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. మొత్తం పన్నెండు స్టేషన్లలో ఆగనుంది.
అదే నాలుగు స్టేషన్లలో ఆగేలా బుల్లెట్ ట్రైన్ ప్లాన్ చేస్తే ప్రయాణ సమయం 1.58 గంటల్లోనే పూర్తి అవుతుందని చెబుతున్నారు. 2017లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినా.. భూసేకరణ తదితర అంశాల కారణంగా ఆలస్యమైంది.
షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 2023 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే.. ఈ ప్రాజెక్టును 2029 చివరి నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారు. భారత బుల్లెట్ ట్రైన్ జపాన్ లో తయారు కానుందా? స్వదేశీ టెక్నాలజీ మీద ఆధారపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల నిర్మాణంలో ఉన్న సూరత్ స్టేషన్ ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. జరుగుతున్న పనుల మీద సంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. మొత్తంగా బుల్లెట్ ట్రైన్ తొలుత పరుగు తీసే డేట్ మీద స్పష్టత వచ్చిందని చెప్పాలి.
