Begin typing your search above and press return to search.

2026-27 కేంద్ర బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్!

గత కొంతకాలంగా భారత్ ముందు బంగ్లా తోక జాడిస్తున్న సంగతి తెలిసిందే! ఇస్లామాబాద్ తో రాసుకుపూసుకు తిరుగుతూ హస్తినపై అక్కసు వెళ్లగక్కుతుంది.

By:  Raja Ch   |   2 Feb 2026 12:04 AM IST
2026-27 కేంద్ర బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్!
X

గత కొంతకాలంగా భారత్ ముందు బంగ్లా తోక జాడిస్తున్న సంగతి తెలిసిందే! ఇస్లామాబాద్ తో రాసుకుపూసుకు తిరుగుతూ హస్తినపై అక్కసు వెళ్లగక్కుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై దాడులకు తెగబడుతున్న పరిస్థితి. ప్రధానంగా.. 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన పతనం తర్వాత భారత్ - బంగ్లా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి! ఈ సమయంలో ఢాకాకు ఢిల్లీ షాకిచ్చింది.

అవును... బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పాలనలో ఢాకాకు - ఢిల్లీకి మధ్య సంబంధాలు బాగుండేవనే సంగతి తెలిసిందే. అయితే.. ఆమె పాలన పతనం అనంతరం తాత్కాలిక నాయకుడిగా పగ్గాలు పుచ్చుకున్న ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇందులో భాగంగా... పాకిస్థాన్ పట్ల ఢాకా విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి కాస్తా.. భారత్ - బంగ్లా దౌత్య దూరాన్ని పెంచాయి!

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ లో తాజాగా ప్రవేశ పెట్టబడిన 2026-27 వార్షిక బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు షాక్ తగిలింది. తాజా కేంద్ర బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు భారత్ తన కేటాయింపులను గనణీయంగా తగ్గించింది. ఇందులో భాగంగా... భారత ప్రభుత్వ ఆ పొరుగు దేశానికి రూ.60 కోట్లు కేటాయించింది. వాస్తవానికి గా ఆర్థిక సంవత్సరంలో ఆ దేశానికి రూ.120 కోట్లు కేటాయించగా.. తాజాగా బలహీనమైన దౌత్య బంధాల నడుమ అది కాస్తా 50 శాతానికి తగ్గించింది!

మరోవైపు భారతదేశం నుంచి అత్యధికంగా విదేశీ సహాయం పొందుతున్న దేశంగా భూటాన్ కొనసాగుతోంది. ఈ దేశానికి గత వార్షిక బడ్జెట్ లో భారత్ రూ.2,150 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది మరింత పెంచి దాన్ని రూ.2,289 కోట్లకు పెంచింది.

చాబహార్ పోర్టుకు నిధులు లేవు!:

తాజా బడ్జెట్ లో భారత్.. చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం ఆసక్తిగా మారింది. ఇరాన్ పై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ఈ చర్య అని అంటున్నారు! వాస్తవానికి గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ రూ.100 కోట్లు కేటాయించింది. కాగా... భారత్ - ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన చాబహార్ పోర్టు.. ప్రాంతీయ కనెక్టివిటీ, వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది.

కాగా... గత నెలలో దీనిపై మాట్లాడిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్... చాబహార్ కు సంబంధించిన విషయాలపై వాషింగ్టన్ తో భారత్ యాక్టివ్ గా పాల్గొంటుందని అన్నారు. మరోవైపు... టెహ్రాన్ తో వ్యాపారం నిర్వహించే దేశాలపై 25% అదనపు సుంకాల బాదుడు తప్పదంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ వివిధ ఎంపికలను అన్వేషిస్తోందని అంటున్నారు!