Begin typing your search above and press return to search.

శత్రువును మరింత వణికిస్తున్న బ్రహ్మోస్.. ఇక నిద్రలేని రాత్రులే..

ప్రస్తుతం 450 కిలోమీటర్ల దూరం వరకూ మాత్రమే లక్ష్యాలను ఛేదించగలిగే బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి, ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించబోతోంది.

By:  Tupaki Political Desk   |   20 Oct 2025 2:00 PM IST
శత్రువును మరింత వణికిస్తున్న బ్రహ్మోస్.. ఇక నిద్రలేని రాత్రులే..
X

భారత రక్షణ రంగం మరోసారి తన శక్తిని ప్రపంచానికి చూపించబోతోంది. యుద్ధం అంటే కేవలం గన్‌ సౌండ్‌లు, ట్యాంకుల కదలికలు మాత్రమే కాదు.. అది సాంకేతిక ప్రతిభకు, వ్యూహాత్మక ఆలోచనకు, దూరదృష్టికి సంబంధించిన విజ్ఞాన రంగం. ఆ విజ్ఞానానికి ఇప్పుడు మరో రూపం ‘బ్రహ్మోస్‌’. శత్రు దేశాల పట్ల భారత్‌ చూపించే మౌన శక్తి ఇదే. కానీ ఇప్పుడు ఆ మౌనం మరింత శబ్ధంతో రాబోతోంది. ఎందుకంటే, భారత రక్షణ రంగ సంస్థలు ఈ క్షిపణిని రెండింతల శక్తితో పునర్నిర్మిస్తున్నాయి.

800 కిలో మీటర్లకు పెంపు..

ప్రస్తుతం 450 కిలోమీటర్ల దూరం వరకూ మాత్రమే లక్ష్యాలను ఛేదించగలిగే బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి, ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించబోతోంది. ఈ అప్‌గ్రేడ్‌ కేవలం సంఖ్యలలోని మార్పు మాత్రమే కాదు.. ఇది భారత రక్షణ తత్వంలో వచ్చిన గంభీర పరిణామం. శబ్ద వేగం కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా ప్రయాణించే ఈ క్షిపణి, 2027 నాటికి ఈ కొత్త సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. రష్యాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక అద్భుతం, ఇప్పటికే ప్రపంచ రక్షణ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు శత్రు స్థావరాలకు చేరుకునే సమయాన్ని క్షిపణులు కొలిచేవి. ఇకపై శత్రువుల ప్రతిస్పందన సమయాన్ని కొలిచే స్థాయికి ఈ సాంకేతికత చేరుకుంటోంది.

ఫస్ట్ నౌకాదళం చేతిలోకే..

భారత నౌకాదళం చేతుల్లో మొదటగా ఈ కొత్త వేరియంట్‌ చేరనుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, నౌకాదళం వినియోగించే ప్రస్తుత బ్రహ్మోస్‌ క్షిపణికి సాఫ్ట్‌వేర్‌, ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థల్లో మార్పులు చేస్తేనే ఈ రేంజి పెంపు సాధ్యం అవుతుంది. అంటే, డిజైన్‌ మారదు కానీ సామర్థ్యం పెరుగుతుంది. ఆ తర్వాత ఈ అప్‌గ్రేడ్‌ ఆర్మీకి, చివరగా వాయుసేనకు విస్తరించనున్నారు. ఇదే క్రమంలో సుఖోయ్‌–30 ఎంకేఐ జెట్‌లలో అమర్చిన బ్రహ్మోస్‌ వేరియంట్‌ ఇప్పుడు భారత వైమానిక శక్తికి కొత్త ఆధారం కానుంది.

గగణ తలం నుంచి ఈ అస్త్రం..

గగనతల యుద్ధతంత్రంలో మరో కీలక పురోగతి ‘అస్త్ర’ ప్రాజెక్టు. నేటి యుద్ధాలు కంటికి కనబడే శత్రువుతో కాదు.. సుదూరంగా ఉన్న ఆకాశంలోనే ముగుస్తాయి.. ఇందులో ‘బియాండ్‌ విజువల్‌ రేంజ్‌’ (BVR) క్షిపణుల పాత్ర కీలకం. ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న అస్త్ర మార్క్‌–1 క్షిపణి 110 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయగలదు, మార్క్‌–2ను 280 కిలోమీటర్ల దూరం దాకా విస్తరించే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇక డెవలప్ దశలో ఉన్న మార్క్‌–3 మాత్రం ఘన ఇంధన రామ్‌జెట్‌ ఇంజిన్‌తో 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకగలదు. ఇది పూర్తయితే, భారత వాయుసేనకు అవసరమైన బీవీఆర్‌ క్షిపణుల కోసం విదేశీయులు ఆధారపడే పరిస్థితి ముగిసిపోతుంది.

ప్రతిష్టతను పెంచుతున్న డీఆర్డీఓ

భారత రక్షణ పరిశోధన సంస్థలు (DRDO) రూపొందిస్తున్న ఈ శ్రేణి ప్రాజెక్టులు దేశ భద్రతను మాత్రమే కాకుండా.. దేశ ప్రతిష్ఠను కూడా పెంచుతున్నాయి. పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలు ఇలాంటి అప్‌గ్రేడ్‌లను కేవలం సైనిక అభివృద్ధిగా కాకుండా వ్యూహాత్మక సంకేతంగా చూస్తున్నాయి. ప్రతి సారి భారత్‌ తన సాంకేతిక శక్తిని చూపినప్పుడు, దాయాదీ దేశాల్లో మౌనంగా ఆందోళన, అలజడి రేగుతుంది.

భారత్ తో యుద్ధం వద్దనేలా..

భారత్ ఇప్పుడు ‘తిరుగుబాటు సమాధానం’ నుంచి ‘నిరోధక ప్రతిస్పందన’ దశకు చేరుకుంది. యుద్ధం జరగకముందే ప్రత్యర్థి వెనక్కి తగ్గే స్థాయికి చేరుకోవడమే నూతన వ్యూహం. బ్రహ్మోస్‌, అస్త్రలు ఈ వ్యూహానికి రెండు బలమైన చేతులనే చెప్పాలి. ఇవి కేవలం ఆయుధాలు కాదు.. అవి ఒక దేశ ఆత్మగౌరవం, ఒక జాతి ప్రతిభ, ఒక సాంకేతిక విప్లవం.

ఈ క్షిపణుల విజయగాథ వెనుక ఉన్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కేవలం రక్షణ రంగంలో మాత్రమే కాకుండా భారత ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. యుద్ధం జరగకూడదని కోరుకునే దేశం భారత్‌, యుద్ధం చేసే శక్తి ఉన్నా శాంతి కాముక దేశమని ప్రపంచానికి నిరూపిస్తోంది.

బ్రహ్మోస్‌ పేరిట పుట్టిన ఈ అస్త్రం ఇప్పుడు ఆకాశాన్నీ, సముద్రాన్నీ, నేలనూ ఒకే సారి గెలుచుకునే దిశగా పయనిస్తోంది. 450 కిలోమీటర్ల దాకా దూసుకెళ్లిన క్షిపణి ఇప్పుడు 800 కిలోమీటర్ల దిశగా దూసుకుపోతుంది అది కేవలం రేంజ్ కాదు, అది భారత ఆత్మవిశ్వాసం పెరుగుతున్న దూరం.