బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ యూఏఈకి.. మధ్యప్రాచ్యంలో భారత్‌కు మరో వ్యూహాత్మక విజయం
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారతదేశం.. నేడు "మేక్ ఇన్ ఇండియా", "ఆత్మనిర్భర్ భారత్" నినాదాలతో రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా శరవేగంగా ఎదుగుతోంది.
By: A.N.Kumar | 23 Jun 2026 12:00 AM ISTభారత రక్షణ రంగం మరో అంతర్జాతీయ మైలురాయికి చేరువవుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'బ్రహ్మోస్' తో పాటు.. స్వదేశీ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ 'ఆకాశ్‌తీర్' ను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం గనక ఖరారైతే గల్ఫ్ ప్రాంతంలో భారత రక్షణ ఉత్పత్తులకు సరికొత్త మార్కెట్ ఓపెన్ కానుంది.
భారత్ డిఫెన్స్ మార్కెట్‌లో సరికొత్త అధ్యాయం
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారతదేశం.. నేడు "మేక్ ఇన్ ఇండియా", "ఆత్మనిర్భర్ భారత్" నినాదాలతో రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయగా.. ఇప్పుడు యూఏఈ నాలుగో విదేశీ కస్టమర్‌గా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా గల్ఫ్ రీజియన్‌లో అత్యంత కీలకమైన యూఏఈ లాంటి దేశం భారత ఆయుధాలపై మొగ్గు చూపడం దేశీయ రక్షణ రంగానికి దక్కిన పెద్ద గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్రహ్మోస్, ఆకాశ్‌తీర్ ఎందుకంత ప్రత్యేకం?
యూఏఈ రక్షణ అవసరాలకు ఈ రెండు వ్యవస్థలు అత్యంత కీలకంగా మారనున్నాయి. బ్రహ్మోస్ క్షిపణిని భారత్‌కు చెందిన డీఆర్.డీఓ, రష్యాకు చెందిన ఎన్‌పిఓ మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో (మాక్ 2.8) దూసుకెళ్లగలదు. సముద్రం, భూమి, గగనతలం నుంచి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం దీని సొంతం.
ఆకాశ్‌తీర్ వ్యవస్థ చూస్తే.. ఇది భారత సైన్యానికి చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ నెట్‌వర్క్. యుద్ధ సమయంలో శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, విమానాల ముప్పును ముందే గుర్తించి, వివిధ రక్షణ వ్యవస్థలను ఒకే తాటిపైకి తెచ్చి సమన్వయం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం
ఈ ఒప్పందం కేవలం ఆయుధాల విక్రయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మధ్యప్రాచ్యంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల ప్రాబల్యానికి బ్రేక్ వేస్తూ గల్ఫ్ దేశాలతో భారత్ దౌత్య, వ్యూహాత్మక బంధాన్ని మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. యూఏఈతో ఈ మెగా డీల్ కార్యరూపం దాల్చితే భారత రక్షణ ఎగుమతుల లక్ష్యాలకు భారీ ఊపు లభించడమే కాకుండా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో భారతదేశం ఒక "గ్లోబల్ డిఫెన్స్ హబ్"గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.
