Begin typing your search above and press return to search.

బిలియనీర్ల భారతం...ప్రపంచంలో గ్రేట్ ప్లేస్

ఇక ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక అన్ని రంగాలలో అపర కుబేరులు అవతరిస్తున్నారు అని అర్ధం అవుతోంది.

By:  Satya P   |   8 March 2026 9:34 AM IST
బిలియనీర్ల భారతం...ప్రపంచంలో గ్రేట్ ప్లేస్
X

భారత దేశాం ఆర్థిక పరిస్థితుల గురించి వివరించాలని అనుకున్నపుడు కుబేరుల భారతం ఒక వైపు కటిక పేదల భారతం ఇంకో వైపు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ దేశంలో కోట్లకు పడగెత్తిన వారు అంతా ఒక వైపు ఉంటే కూటికి లాటరీ కొట్టే వారు వేరొక వైపు ఉంటారు అందుకే రెండు భారత దేశాలు ఉన్నాయని చెబుతారు ఒకటి పేదల భారం మరొకటి ధనికుల భారతం. ఈ దేశం ఆర్థికంగా ఎదుగుతోంది, మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతోంది.

ఫలితాలు కొందరికే :

అది సంతోషమే కానీ ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం నూటికి ఎనభై శాతం పైగా ఉన్న పేదలు దిగువ మధ్య తరగతి వర్గాలకు చేరడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. కేవలం పది శాతం మందికే ఆర్థిక సంస్కరణ ఫలితాలు దక్కాయన్నది నిష్టుర సత్యమని ఆర్ధిక నిపుణులు చెబుతారు. గడచిన మూడున్నర దశాబ్దాలుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణలు నయా జమీందార్లను తయారు చేశాయన్నది వాస్తవం అంటారు. దానికి తగిన సాక్ష్యాలు కూడా అన్ని చోట్లా భారీ నంబర్ల రూపంలో కనిపిస్తున్నాయని ప్రసిద్ధి చెందిన ఎకనామిస్టులు గుర్తు చేస్తారు.

బిలియనీర్లు మనవారే :

ఇక ప్రపంచంలో చూస్తే అత్యధిక సంఖ్యలో ఉన్న బిలియనీర్లు భారతీయులే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో భారత్ బిలియనీర్ల జాబితాలో వరల్డ్ లోనే మూడో స్థానాన్ని దక్కించుని గ్రేట్ అనిపించుకుంటోంది. తాజాగా చూస్తే మరో 24 మంది అపర కుబేరులు భారత్ లో ఆవిర్భవించారు. కేవలం ఏడాది వ్యవధిలో వీరు బిలియనీర్లు అయ్యారు అన్న మాట. ఇక ఈ బిలియనీర్లలో ఆరోగ్య రంగం నుంచే ఎక్కువ మంది రావడం విశేషం.

ఆ రెండు దేశాల తరువాత :

ఇక అపర కుబేరుల జాబితాను తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ అరుదైన ఖ్యాతిని గడించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో ప్రస్తుతం మొత్తం 308 మంది బిలియనీర్లు ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. బిలియనీర్లు ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతున్నారు అంటే భారత దేశంలో సంపద సృష్టి అన్నది పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు. అలాగే ఆర్థిక వృద్ధి రేటు సైతం బాగుందని గణాంకాల ద్వారా వెల్లడి అవుతున్నాయని అంటున్నారు.

బిలియనీర్ల సంపద :

దేశంలో ఉన్న మొత్తం 308 మంది బిలియనీర్ల మొత్తం సంపద ఎంత అంటే నోరు వెళ్లబెట్టేటంత అని జవాబు వస్తుంది. అచ్చంగా 112.6 లక్షల కోట్ల రూపాయల సంపద వీరి దగ్గర ఉంది అన్న మాట. అంటే 112.6 ట్రిలియన్లుగా కూడా చెప్పవచ్చు. ఇందులో కూడా 199 మంది సంపద పెద్ద ఎత్తున పెరిగింది. మిగిలిన 109 మంది సంపద స్థిరంగా ఉండటం జరుగుతోంది. అంటే ఈ అపర కుబేరుల మొత్తం సంపద మరో పది శాతం పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి.

అన్ని రంగాల్లో కుబేరులు :

ఇక ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక అన్ని రంగాలలో అపర కుబేరులు అవతరిస్తున్నారు అని అర్ధం అవుతోంది. ఆరోగ్య రంగానికి చెందిన వారు 53 మంది బిలియనీర్లు గా ఉంటే ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి 36 మంది, కన్జ్యూమర్ గూడ్స్ నుంచి 31 మంది కొత్తగా అపర కుబేరుల జాబితాలో చేరిపోయారు. అదే విధంగా ఇంధన రంగంలో కూడా అపర కుబేరులు ఉన్నారు. ఎనిమిది మంది దాకా ఈ రంగంలో ఉంటే వీరి సంపద చూస్తే ఇంధన రంగం అత్యధిక సంపదను కలిగి 18.3 లక్షల కోట్ల రూపాయలు ఉండడం విశేషం.

కుబేరుల నగరంగా :

దేశంలో కుబేరుల నగరం ఏదీ అంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అని తెలుస్తోంది. అక్కడ 95 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబైలో కొత్తగా 15 మంది బిలియనీర్లు జత కలిశారు. దాంతో న్యూయార్క్, లండన్ లను ముంబై ఈ విషయంలో అధిగమించింది అని అంటున్నారు.

మహిళా కుబేరులు :

కుబేరుడు అంటే పురుషుడే కావచ్చు. కానీ మహిళకు తాము ఏమీ తీసిపోమని ఆ వివక్ష అవసరం లేదని చాటి చెబుతున్నారు. ఆ విధంగా మొత్తం 308 బిలియనీర్లలో ఏడు శాతం అంటె 23 మంది మహిళా కుబేరులు ఉండడం విశేషం. వీరి వద్ద ఉన్న సంపద ఏకంగా 9.8న్ లక్షల కోట్లు ఉన్నట్లుగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 నివేదిక వెల్లడించింది. వయసుల వారీగా చూస్తే ప్రపంచ కుబేరుల సగటు వయసు 65గా ఉంది. అదే భారత్ లో మాత్రం సగటు కుబేరుల వయసు 67గా నమోదు అయింది. ఏది ఏమైనా భారత్ పేద దేశం అని ఎవరు అన్నారు అని వీరిని చూసినపుడు ప్రశ్న వేసుకోవాలి. అయితే సంపద సృష్టి ఇంతలా జరుగుతున్నా ఫలాలు మాత్రం అందరికీ సమానంగా దక్కడం లేదన్న వాదన మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటోంది.