Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

మూడు పదుల క్రితం "తీసుకోబావా.. నీళ్లన్నీ నీవే" అని రాసిచ్చిన గంగా జలాల ఒప్పందం గడువు తీరడంతో ఢాకా పెద్దలకు ఉన్నట్టుండి చలిజ్వరం పట్టుకుంది

By:  A.N.Kumar   |   2 Nov 2026 11:51 PM IST
రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్
X

మూడు పదుల క్రితం "తీసుకోబావా.. నీళ్లన్నీ నీవే" అని రాసిచ్చిన గంగా జలాల ఒప్పందం గడువు తీరడంతో ఢాకా పెద్దలకు ఉన్నట్టుండి చలిజ్వరం పట్టుకుంది. "పాత ఒప్పందాన్నే యథాతథంగా పళ్లెంలో పెట్టి మళ్ళీ ఐదారేళ్ళు బహుమతిగా ఇస్తారులే" అని గాలిలో మేడలు కట్టిన బంగ్లాదేశ్ పాలకులకు.. ఈసారి మోదీ సర్కార్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ఉంది. "బెంగాల్, బీహార్ రైతులు నోళ్ళు వెళ్లబెట్టి చూస్తుంటే... మేము మాత్రం ఉచితంగా నీళ్ళు వదిలి ఛారిటీ ట్రస్ట్ నడుపుతున్నామా ఏంటి?" అంటూ భారత్ వేస్తున్న కొత్త నీటి లెక్కలు చూసి.. ఇటు సరిహద్దు దాటి నీళ్ళు ప్రవహిస్తాయో లేదో గానీ అటు ఢాకా దౌత్యవేత్తల షర్టులు మాత్రం తడిసి ముద్దవుతున్నాయి.

భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో అత్యంత కీలకమైన.. మూడు దశాబ్దాల నాటి గంగా జలాల పంపిణీ ఒప్పందం 2026 డిసెంబర్ 12 నాటికి ముగింపు దశకు చేరుకుంటోంది. 1996లో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం భవిష్యత్తుపై ఇప్పుడు నూతన చర్చలకు తెరలేచింది. అయితే గతంలో ఉన్న నిబంధనలను యథాతథంగా కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా లేదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే దౌత్య సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక అడుగు ముందుకు వేస్తోంది.

1996 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం జనాభా పెరుగుదల, తాగునీటి ఎద్దడి, విస్తరిస్తున్న వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాల నీటి అవసరాలను విస్మరించి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బీహార్, బెంగాల్ ప్రజల భవిష్యత్తు నీటి అవసరాలను సమగ్రంగా సమీక్షించిన తరువాతే నూతన ఒప్పంద రూపకల్పన జరుగుతుందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక విదేశాంగ సంబంధిత నిర్ణయం మాత్రమే కాక.. మన రైతులు, స్థానిక ప్రజల జీవనాధారంతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం.

గడిచిన ముప్పై ఏళ్లలో వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు, కరువు-వరదల తీవ్రత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాత గణాంకాల ఆధారంగా మరో 30 ఏళ్లకు ఒప్పందం చేసుకోవడం శాస్త్రీయంగా సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే అత్యవసర పరిస్థితులలో నీటి నిర్వహణ, తాజా ప్రవాహ సమాచారం మార్పిడి, మరింత సౌలభ్యం కలిగిన నిబంధనలతో కూడిన స్వల్పకాలిక లేదా సమీక్షించదగిన ఒప్పందాల వైపు భారత్ మొగ్గు చూపుతోంది.

దిగువన ఉన్న బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి, పద్మా నది నీటి లభ్యత అత్యంత కీలకమైనది. ఉప్పునీటి ప్రభావం పడకుండా ఉండటానికి వారు తగినంత నీటి వాటాను ఆశిస్తున్నారు. కాబట్టి భారతదేశం తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటూనే, పొరుగు దేశానికి న్యాయమైన వాటా అందేలా.. అదే సమయంలో తన రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా సమతుల్యమైన వ్యూహాన్ని రచిస్తోంది.

నదులు రాజకీయ సరిహద్దులను దాటి ప్రవహిస్తాయి. ఈ సవాలును ఒక వివాదంగా కాకుండా.. సరిహద్దు దేశాల మధ్య నూతన దౌత్య సహకారానికి.. ఆధునిక నదీ జలాల నిర్వహణకు ఒక అవకాశంగా మలచుకోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశం తీసుకునే ఈ నిర్ణయం బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నదన్నది వేచిచూడాలి.