సువేందు సంచలన నిర్ణయం.. సరిహద్దు సమస్యకు ముగింపు!
పశ్చిమబెంగాల్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Political Desk | 11 May 2026 3:12 PM ISTపశ్చిమబెంగాల్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణానికి 127 కిలోమీటర్ల మేర భూమి కేటాయించారు. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో కంచె నిర్మాణం విషయమై కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం మాత్రం రకరకాల కారణాలు చూపుతూ భూ కేటాయింపులను నిరాకరిస్తూ వస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేస్తున్న సువేందు అధికారి అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సరిహద్దు సమస్యకు ముగింపు పలికినట్లైందని అంటున్నారు.
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణానికి 45 రోజుల్లో భూమి అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారత్-బంగ్లా సరిహద్దుల్లో దాదాపు 2,217 కిలోమీటర్ల ప్రాంతం పశ్చిమబెంగాల్ కు ఆనుకునే ఉంది. ఇందులో సుమారు 400 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కంచె లేదు. దీంతో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లతోపాటు స్మగ్లింగ్ బెడద ఎక్కువగా ఉంది. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే అంటే 2016లోనే ఫెన్సింగ్ నిర్మించాలని భావించింది.
అయితే అంతర్జాతీయ సరిహద్దు పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు పెంచడంతో గత ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. 50 కిలోమీటర్ల పరిధి మేరకు అంతర్జాతీయ సరిహద్దు చేస్తే ఆ ప్రాంతంపై ఆధిపత్యం కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లిపోతుందని, స్థానిక పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. అయితే కేంద్రం నిర్ణయం అమలు చేయాలని, దేశ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర పోరాటం చేశారు.
సరిహద్దుల్లో కంచె నిర్మించడం వల్ల చొరబాట్లకు స్మగ్లింగుకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ఆయన వాదించారు. అంతేకాకుండా సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్‌ను అరికట్టడానికి భూమిని వెంటనే అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పిన కోల్ కత్తా హైకోర్టు తక్షణమే భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, మమత సర్కార్ జాప్యం చేయడంపై మార్చిలో మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో మమత సర్కారుకు కాస్త సమయం లభించినట్లైంది. తాజాగా పరిస్థితులు తారుమారు అవడం, అంతర్జాతీయ సరిహద్దుపై కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సువేందు అధికారి ముఖ్యమంత్రి కావడంతో బీఎస్ఎఫ్ కు 127 కిలోమీటర్ల మేర భూమిని అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తొమ్మిది సరిహద్దు జిల్లాల్లో అంటే ముర్షిదాబాద్, నదియా, ఉత్తర 24 పరగణాలు వంటి జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూకేటాయింపులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
