Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టుల చుట్టూ 'స్కైలైన్' కల.. నెరవేరబోతోందా?

భారతీయ నగరాల ఆకృతి మారబోతోంది. ఆకాశహర్మ్యాల నిర్మాణానికి అడ్డుగోడలుగా ఉన్న పాత నిబంధనల సంకెళ్లు తెంచుకునే సమయం ఆసన్నమైంది.

By:  A.N.Kumar   |   17 Feb 2026 1:00 PM IST
ఎయిర్ పోర్టుల చుట్టూ స్కైలైన్ కల.. నెరవేరబోతోందా?
X

భారతీయ నగరాల ఆకృతి మారబోతోంది. ఆకాశహర్మ్యాల నిర్మాణానికి అడ్డుగోడలుగా ఉన్న పాత నిబంధనల సంకెళ్లు తెంచుకునే సమయం ఆసన్నమైంది. విమానాశ్రయాల పరిసరాల్లో భవనాల ఎత్తుపై ఉన్న పరిమితులను సడలించే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ చేస్తున్న ఆలోచన కేవలం నిర్మాణ రంగానికి సంబంధించినది మాత్రమే కాదు.. ఇది దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక సాహసోపేతమైన అడుగు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు నేతృత్వంలో జరుగుతున్న ఈ కసరత్తు, ఆధునిక అవసరాలకు.. సాంకేతికతకు మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

నగరాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భూమి లభ్యత ఒక ప్రధాన సవాలుగా మారింది. క్షితిజ సమాంతరంగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవడం వల్ల రవాణా భారం, మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం నిలువు దిశగా అభివృద్ధి . విమానాశ్రయాల సమీపంలో విలువైన భూమి ఉన్నప్పటికీ, ఎత్తు పరిమితుల వల్ల అక్కడ భారీ ప్రాజెక్టులు చేపట్టలేక రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడుతోంది. ఇప్పుడు ఆ ఆంక్షలను శాస్త్రీయంగా సవరించడం ద్వారా గృహ నిర్మాణ రంగంతో పాటు, హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాలు, లాజిస్టిక్స్ హబ్‌లకు ఊతం లభించనుంది.

అయితే ఈ సంస్కరణలు నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు 'భద్రత' అనే అత్యంత కీలకమైన అంశం ఉంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ల సమయంలో అణువంత పొరపాటు జరిగినా ప్రాణనష్టం ఊహాతీతం. అందుకే భవనాల ఎత్తును పెంచే క్రమంలో అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలను తూ.చా. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసం భద్రతను పణంగా పెట్టలేం. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో భద్రతకు విఘాతం కలగకుండా ఎత్తు పెంచడం అసాధ్యమేమీ కాదు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇది ఒక వరం. అమరావతి నిర్మాణంలో ఉన్న తరుణంలోనూ విశాఖపట్నం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న క్రమంలోనూ ఈ సడలింపులు రాష్ట్ర ఆర్థిక గతిని మార్చగలవు. భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. చంద్రబాబు నాయుడు వంటి దూరదృష్టి గల నాయకత్వంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఏపీ నగరాలు సింగపూర్, దుబాయ్ తరహా స్కైలైన్‌ను సొంతం చేసుకోవడం సుసాధ్యమే.

కానీ ప్రభుత్వం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భవనాల ఎత్తు పెరిగితే ఆ ప్రాంతంలో జనాభా సాంద్రత కూడా పెరుగుతుంది. దానికి అనుగుణంగా డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచకపోతే నగరాలు 'కాంక్రీట్ అరణ్యాలు'గా మారి ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణను విస్మరించకూడదు.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ. పాత నిబంధనలను కాలానికి అనుగుణంగా మార్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మార్పులు అమలులోకి వస్తే, భారతీయ నగరాలు కేవలం భూమిపైనే కాదు.. ఆకాశంలోనూ తమ ఉనికిని చాటుకుంటాయి. భద్రతను కవచంగా.. ఆధునికతను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగితేనే ఈ 'స్కైలైన్' కల సాకారమవుతుంది.