2027 వరకు ప్రయాణం గాలిలోనే.. అందుబాటులోకి రానున్న ఈ వాహనాలు.
ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల ప్రధాన ఆకర్షణ సమయం ఆదా కావడమే. అభివృద్ధి చెందిన, రద్దీగా ఉండే నగరాల్లో రోడ్డు మార్గంలో గంటలు పట్టే ప్రయాణం కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది.
By: Tupaki Political Desk | 2 Oct 2025 3:00 PM ISTప్రపంచ జనాభాలో భారత దేశం మొదటి స్థానంలో ఉంది. అందుకే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువే. రష్యా, చైనా లాంటి దేశాలతో పోల్చుకుంటే భూభాగం కూడా తక్కువే. అందుకే ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సరిపడినన్ని రోడ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ కు ఎప్పుడూ అంతరాయం ఉండనే ఉంటుంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా.. మెట్రోలు తెచ్చినా నేలపైన ట్రాఫిక్ సమస్య మాత్రం తీరదు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఎయిర్ ట్యాక్సీలు రావాలని ప్రజలు కోరుతున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేశారు. విజయం సాధించారని చెప్పవచ్చు. రెండేళ్లలో ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయి.
జోబీ ఏవియేషన్, లిలియం వంటి గ్లోబల్ సంస్థలు, భారత్ లో ‘ఈ-ప్లేన్’ వంటి అంకుర సంస్థలు ఈ కొత్త శకాన్ని ప్రారంభించాయి. ఆకాశాన్ని నగరాల రోడ్డు మార్గంగా మార్చే ఈ సాంకేతికత ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉంది. 2025-2030 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల ఆకాశంలో వీటి వాణిజ్య కార్యకలాపాలు మొదలు కావచ్చని అంచనా.
నగర రద్దీకి చెక్..
ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల ప్రధాన ఆకర్షణ సమయం ఆదా కావడమే. అభివృద్ధి చెందిన, రద్దీగా ఉండే నగరాల్లో రోడ్డు మార్గంలో గంటలు పట్టే ప్రయాణం కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది. రన్‌వే అవసరం లేకపోవడం, చిన్నపాటి స్థలంలోనే ల్యాండ్ కావడం వంటి లక్షణాల వల్ల, ఇవి అత్యవసర (Medical Emergencies), విపత్తు (Disaster Relief) సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించగలవు. సాంప్రదాయ హెలికాప్టర్ల కంటే ఎలక్ట్రిక్ మోటార్లు సరళంగా ఉండడం వల్ల వీటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధంగా చూస్తే, eVTOLలు కేవలం లగ్జరీ ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, భవిష్యత్తు పట్టణ జీవనంలో అత్యంత అవసరమైన సాంకేతికతగా నిలవనున్నాయి.
2027 కల్లా మొదటి ట్యాక్సీ ప్రయాణం..
దేశంలో తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ 2027, జూన్ కల్లా అందుబాటులోకి రానుందన్న వార్త సాంకేతిక ప్రగతికి కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. నగరాలు రానురాను రద్దీతో నిండుతుండగా.. సమీప గమ్యస్థానాలకు సత్వరం చేరే మార్గాల కోసం ప్రజలు తహతహలాడుతున్నారు. ఇలాంటి సమయంలో ‘ఈ-ప్లేన్’ కంపెనీ తీసుకొస్తున్న ఎయిర్ ట్యాక్సీ ఆలోచన, పట్టణ రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశముంది.
అద్భుతమైన ప్రాజెక్టకు ఆద్యులు వీరే..
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి, ఆయన శిష్యుడు ప్రంజల్ మెహతా కలసి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రయాణికుల సౌకర్యాన్ని మాత్రమే కాదు, అత్యవసర వైద్య రవాణా అవసరాలనూ దృష్టిలో ఉంచుకుంది. ఒక్క వాహనంలో ఇద్దరిని తీసుకెళ్లగలగే ఈ కాంపాక్ట్ విమానం రన్‌వే అవసరం లేకుండా డ్రోన్‌లా ఎగుతుంది. ఒకసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ దూరం ప్రయాణించగలగడం, రోడ్డు మార్గంలో గంట పట్టే దూరాన్ని కేవలం 10–15 నిమిషాల్లో కవర్ చేయగలగడం వంటి లక్షణాలు ఈ వాహనాన్ని మరింత ఆచరణాత్మకంగా నిలబెడతాయి.
సాధ్యాసాధ్యాల పరిశీలన..
కానీ ఈ సాంకేతిక విప్లవం విజయవంతం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ఖర్చుల నియంత్రణ అవసరం అవుతాయి. ఈ దశలు అన్నీ పూర్తయిన తర్వాత ఒకవేళ వీటిని సక్రమంగా అమలు చేస్తే.. 2027లో భారత నగరాల ఆకాశం కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఎయిర్ ట్యాక్సీ కల కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు.. పట్టణ జీవనశైలికి మార్గదర్శకం కూడా.
