Begin typing your search above and press return to search.

99లో వెన్నుపోటు పొడిచిన తాలిబాన్లతో స్నేహం వెనుక భారత్ వ్యూహాలివే..!

1995లో అఫ్గాన్‌ లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. 2001 వరకు పరిపాలించారు. ఆ ఆరేళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాశారు.

By:  Raja Ch   |   12 Oct 2025 1:45 PM IST
99లో వెన్నుపోటు పొడిచిన తాలిబాన్లతో స్నేహం వెనుక భారత్  వ్యూహాలివే..!
X

అంతర్జాతీయ దౌత్యంలో ఇటీవల ఓ కీలక పరిణామ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఆమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ భారత్‌ వచ్చారు. భారత్ తమకు ఫ్రెండ్ అని ప్రకటించారు. దీంతో.. ఒకప్పుడు తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్... వారితో సత్సంబంధాలను నెరపడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ల తొలిదశ పాలనలో భారత్ కు కలిగించిన నష్టాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

అవును... 2021లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ విషయంలో తాలిబన్ల వైఖరి తొలిదశ పాలనతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. వారు భారత్ ను మిత్రదేశంగా చూడటం ప్రారంభించారు. గతంలోలా భారత్‌ పై దాడి చేసే ఉగ్ర సంస్థలకు ఆశ్రయమివ్వడమూ మానేశారు. అయినప్పటికీ తాలిబాన్లతో స్నేహం చాలా మంది భారతీయులకు రుచించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.

భారత్ కు వెన్నుపోటు పొడిచిన తాలిబన్లు!:

1999లో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం ఐసీ-814ను పాకిస్థాన్‌ కు చెందిన ఉగ్రవాదులు హైజాక్‌ చేసి అఫ్గాన్‌ లోని కాందహార్‌ లో దించారు. ఆ సమయంలో భారత్ పట్ల తాలిబన్లు అనుసరించిన వైఖరి ఆగ్రహజ్వాలలను రేపింది. ఆ ఘటనలో పైకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ హైజాకర్లకు తాలిబన్లు కొమ్ముకాశారు. భారత్ కు వెన్నుపోటు పొడిచారు.

ఈ క్రమలో.. భారత్ హైజార్కర్ల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఫలితంగా... మసూద్‌ అజహర్, ఒమర్‌ షేక్‌ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులను విడిచిపెట్టింది. అలా తాలిబాన్లు భారత్ విషయంలో వ్యవహరించిన వైఖరి పట్ల భారతీయులు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో... ఈ ఏడాది ఆగస్టు 15న కాబుల్ ను తాలిబన్లు చేజిక్కించుకున్నాక ఇక భారత్ శాస్వతంగా ఆఫ్ఘాన్ కు దూరమవుతుందనే చాలామంది భావించారు.

20 సంవత్సరాలు అఫ్గాన్‌ తో భారత్‌ సత్సంబంధాలు!:

1995లో అఫ్గాన్‌ లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. 2001 వరకు పరిపాలించారు. ఆ ఆరేళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాశారు. ఆ దేశ ప్రజలను అణిచివేశారు. దీంతో... వీరి వైఖరిని భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.

అయితే... 2001లో తాలిబన్లు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత సుమారు 20 సంవత్సరాలు అఫ్గాన్‌ తో భారత్‌ సత్సంబంధాలు కొనసాగించింది. ముఖ్యంగా ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో భాగంగా... అఫ్గాన్‌ వ్యాప్తంగా రహదారులు, ఆనకట్టలు నిర్మించింది. ఆ దేశ పార్లమెంటు నిర్మాణానికి సైతం సాయం చేసింది.

కట్ చేస్తే 2021లో అఫ్గాన్‌ నుంచి అమెరికా తన సైన్యాన్ని వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చిందని అంతా భావించారు.

2021 తర్వాత మారిన పరిణామాలు!:

2021 ఆగస్టులో తాలిబన్లు మరోసారి ఆఫ్ఘాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీనికి గల ప్రధాన కారణం... లష్కరే తోయ్యిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు అఫ్గాన్‌ భూభాగం నుంచి భారత్‌ పై దాడులకు పాల్పడకుండా నిరోధించడమే. మరోవైపు ఇరాన్‌ లో భారత్‌ నిర్మిస్తున్న చాబహర్‌ రేవు ప్రాజెక్టు పూర్తైతే.. ఆఫ్గాన్‌ తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాయి.

మరోవైపు 2021లో తాలిబన్లు మరోసారి కాబుల్ ను ఆక్రమించుకున్న తర్వాత వారికి అటు చైనా, ఇటు పాక్ దగ్గరవ్వాలని భావించాయి. వాటిని అడ్డుకోవడం కోసమో కొంత తాలిబాన్లతో భారత్ సామరస్యపూర్వకంగా సాగిందని అంటారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే... ఆఫ్ఘాన్ అందించిన స్నేహ హస్తాన్ని భారత్ వ్యూహాత్మకంగా అందుకుందని చెబుతున్నారు.