2036 ఒలింపిక్స్ భారత్ లోనే?
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రీడా టోర్నీల్లో రారాజు ఒలింపిక్స్. ప్రపంచ దేశాలన్ని పాల్గొనే ఈ భారీ కార్యక్రమాన్నినిర్వహించటం అంత తేలికైన విషయం కాదు.
By: Garuda Media | 21 Aug 2025 4:00 PM ISTప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రీడా టోర్నీల్లో రారాజు ఒలింపిక్స్. ప్రపంచ దేశాలన్ని పాల్గొనే ఈ భారీ కార్యక్రమాన్నినిర్వహించటం అంత తేలికైన విషయం కాదు. ఈ క్రీడా పండుగకు భారీ ఎత్తున పోటీ నెలకొని ఉంటుంది. దాదాపు పదేళ్లకు ముందే దీనికి సంబంధించిన కసరత్తు షురూ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఒలింపిక్స్ క్రీడల్ని నిర్వహించే అంశంపై పెద్దగా ఫోకస్ పెట్టని భారత సర్కారు.. గడిచిన కొంతకాలంగా ఈ అంశంపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఇందుకు తగ్గట్లే అంతర్జాతీయంగా మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో 2036లో గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ భారీ క్రీడల నిర్వహణ చేపట్టాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న మోడీషాల స్వరాష్ట్రంలోనే ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన బిడ్డింగ్ లోనూ ప్రభుత్వం పాలు పంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వేళ.. ఒక సానుకూల సందేశం భారత్ కు అందింది.
ఒలింపిక్స్ టోర్నీని రెండుసార్లు విజయవంతంగా నిర్వహించి.. ముచ్చటగా మూడోసారి నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్న ఆస్ట్రేలియా.. ఈ మెగా టోర్నీ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాల్ని భారత్ కు అందిస్తామని చెప్పటం ఆసక్తికరంగా మారింది.
2032 ఒలింపిక్స్ కు ఆస్ట్రేలియా వేదిక కానుంది. ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్ క్రీడలు భారత్ కు వేదికగా మారితే.. దీనికి సంబంధించిన ఏ అంశంలో అయినా తమ సహాయ సహకారాల్ని అందించేందుకు తాము సిద్దమని పేర్కొంది. భారీ క్రీడా సంగ్రామం నిర్వహణలో నమ్మకమైన భాగస్వామిగా ఉంటామన్న హామీ ఇచ్చిన ఆస్ట్రేలియా.. ఈ మేరకు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని భావిస్తోంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ ప్రకటన నేపథ్యంలో 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు మంచి మిత్రుడు అండ దొరికినట్లుగా చెప్పాలి. పెద్ద టోర్నీలు ఎలా నిర్వహించాలన్నది భారత్ కు తెలిసినప్పటికి.. ఒలింపిక్స్ అందుకు కాస్త భిన్నమైనదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఏకంగా ఒలింపిక్స్ గ్రామాన్నే నిర్మించాల్సి ఉంటుంది. దీనికి తోడు స్టేడియం నిర్మాణం.. మార్కెటింగ్.. సెక్యూరిటీ.. టికెట్ల అమ్మకం.. క్రీడాకారుల సౌకర్యాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటి విషయంలో ఆస్ట్రేలియాకు ఉన్న అనుభవం ఎక్కువ. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రీడా స్టేడియం డిజైన్ నను ఆస్ట్రేలియా సంస్థే డిజైన్ చేసింది. ఈ నేపథ్యంలో పాత బంధం.. రానున్న రోజుల్లో ఒలింపిక్స్ నిర్వహణకు సాయం చేసే వీలు ఉంటుంది. తాజాగా వచ్చిన ఆస్ట్రేలియా ప్రకటన నేపథ్యంలో 2036లో అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ జరిగే అవకాశాలు మరింత మెరుగు కావటమేకాదు.. ప్రభుత్వం ఈ అంశంలో ఎంత సీరియస్ గా ఉందన్న విసయం అర్థమవుతుందని చెప్పక తప్పదు
