Begin typing your search above and press return to search.

లివ్-ఇన్ జంటలకు కుటుంబ హోదా.. ఈ సారి జన గణనలో కేంద్రం సంచలన నిర్ణయం..

2011 తర్వాత అంటే సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం 16వ జనగణనకు ముహూర్తం ఖరారు చేసింది.

By:  Tupaki Political Desk   |   30 March 2026 3:33 PM IST
లివ్-ఇన్ జంటలకు కుటుంబ హోదా.. ఈ సారి జన గణనలో కేంద్రం సంచలన నిర్ణయం..
X

2011 తర్వాత అంటే సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం 16వ జనగణనకు ముహూర్తం ఖరారు చేసింది. అయితే, ఈసారి జనాభా లెక్కల సేకరణ కేవలం అంకెలకే పరిమితం కాకుండా, మారుతున్న సామాజిక పోకడలను ప్రతిబింబించేలా ఉండడం విశేషం. ముఖ్యంగా సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించాలనే నిర్ణయం సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించిన ఈ కొత్త నిబంధనలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ ప్రక్రియ గురించి తెలుసుకుంటే..

సామాజికంగా ఏం జరుగుతుంది..

ఈసారి జనగణనలో అత్యంత కీలకమైన మార్పు సహజీవన జంటలను ఒకే కుటుంబ హోదా ఇవ్వడం.. వివాహం చేసుకోకుండానే సుదీర్ఘకాలంగా కలిసి ఉంటున్న జంటలను ఇకపై వేర్వేరు వ్యక్తులుగా కాకుండా, ఒకే గృహ సముదాయంగా పరిగణించనున్నారట. ఆధునిక సమాజంలో పెరుగుతున్న లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ కు ఈ నిర్ణయం ఒక రకమైన అధికారిక గుర్తింపునిస్తుంది. ప్రభుత్వ పథకాల అమల్లో లేదంటే గణాంకాల విశ్లేషణలో వీరిని ఒక యూనిట్ గా చూడడం వల్ల ఖచ్చితమైన డేటా నమోదవుతుంది.

రెండు దశల్లో జనగణన

కొవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ ప్రక్రియను కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతన సాంకేతికతతో చేపడుతోంది. తొలి దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీనిని 'గృహ గణన' అంటారు. అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు, అందులో ఉన్న సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు.రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.. ఈ దశలో అసలైన జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రతి వ్యక్తి వయసు, చదువు, వృత్తి వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారు. చరిత్రలో తొలిసారిగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం కల్పించింది.

33 ప్రశ్నల ప్రశ్నావళి

జనగణన కోసం రూపొందించిన 33 ప్రశ్నలు ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసేలా ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాహనాలు (సైకిల్ నుంచి కారు వరకు), ఫోన్లు, ఇంటర్నెట్, టీవీ వంటి వస్తువుల గురించి అడుగుతారు. తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వాడకం, వంటకు వాడే ఇంధనం (గ్యాస్ లేదా కట్టెలు) వంటి వివరాల ద్వారా దేశంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తృణధాన్యాల వినియోగం గురించి కూడా సమాచారం సేకరించడం ద్వారా ప్రజల పోషకాహార స్థాయిని అంచనా వేస్తారు.

కులం, కమ్యూనిటీ..

ఇంటి యజమాని వ్యక్తిగత వివరాలతో పాటు కులం, కమ్యూనిటీ వివరాలను కూడా సేకరిస్తారు. ఇది రిజర్వేషన్ల అమలుకు, వివిధ వర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు అత్యంత కీలకం కానుంది. ఎస్సీ, ఎస్టీ జనాభాలో వచ్చిన మార్పులను ఈ గణాంకాలు స్పష్టం చేస్తాయి. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2011 తర్వాత ఇప్పుడు జరుగుతోంది. పాత డేటా ఆధారంగా పథకాలు అమలు చేయడం వల్ల అర్హులకు న్యాయం జరగడం లేదు. కొత్త లెక్కల వల్ల రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి సేవలు మెరుగుపడతాయి. జనాభా ప్రాతిపదికన ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుకు ఈ గణాంకాలే ఆధారం కానున్నాయి. దేశ జీడీపీ, తలసరి ఆదాయం లెక్కించడానికి ఈ సమాచారం ప్రాథమిక వనరు.

2026 జనగణన అనేది కేవలం జనాభాను లెక్కించడం మాత్రమే కాదు, నవ భారతపు రూపురేఖలను నిర్ణయించే ఒక బృహత్తర కార్యక్రమం. సహజీవన జంటలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా సామాజిక వాస్తవాలను అంగీకరిస్తోంది. మొబైల్ యాప్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతుందని ఆశిద్దాం. ఏప్రిల్ 1 నుంచి వచ్చే అధికారులకు సరైన వివరాలు అందించి ఈ జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావడం ప్రతి పౌరుడి బాధ్యత.