Begin typing your search above and press return to search.

హంగ్ ....ఓవర్ నైట్ కింగ్

తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. అదే సమయంలో ఏకంగా ముప్పయి దాకా మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

By:  Satya P   |   13 Feb 2026 8:42 PM IST
హంగ్ ....ఓవర్ నైట్ కింగ్
X

తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. అదే సమయంలో ఏకంగా ముప్పయి దాకా మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అలాగే ఒక కార్పోరేషన్ లో సైతం హంగ్ వచ్చింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో గెలిచిన ఇండిపెండెంట్లకు గోల్డెన్ చాన్స్ వచ్చినట్లు అయింది. వారే ఇపుడు మహరాజులుగా మారుతున్నారు. ఒక్క సీటు గెలుచుకున్న వారు సైతం లక్ కలసి వస్తే ఏకంగా కుర్చీని కూడా పట్టేసేలా సీఎన్ ఉంది. ఆఫర్ల మీద ఆఫర్లు బంపర్ ఆఫర్లతో తెలంగాణా మునిసిపల్ ఫలితల అనంతరం సీన్ కనిపిస్తోంది.

తులాభారంలో వారే :

ఇదిలా ఉంటే దాదాపుగా 70 దాకా మునిసిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ ఎస్ అయితే 15 దాకా స్పష్టమైన ఆధిక్యతతో దక్కించుకుంది. అయితే 30 దాకా మునిసిపాలిటీల భవితవ్యం ఎటూ తేలకుండా ఉంది. ఇక్కడ హంగ్ ఏర్పడింది. కీలకమైన పార్టీలు మ్యాజిక్ ఫిగర్ ని దక్కించుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. దాంతో ఇండిపెండెంట్లకు యమ డిమాండ్ వచ్చి పడుతోంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మెజారిటీ రాని చోట స్వంతంత్రులు జై కొట్టాల్సింది ఎవరికి అన్నదే చర్చ. మరి వారు ఊరకే జై కొడతారా, వారిని మచ్చిక చేసుకోవాల్సి ఉంది. తమ వైపుగా తెచ్చుకోవాల్సి ఉంది అక్కడ రాజకీయ తమాషా రంజుగా సాగుతోంది.

గేలానికి చిక్కేదెవరు :

మునిసిపాలిటీలలో చైర్ పర్సన్ సీటు దక్కాలీ అంటే ఇండిపెండెంట్లే ఆధారంగా కనిపిస్తోంది. దాంతో వారికి గేలం వేసేందుకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి అని అంటున్నారు. వారి మద్దతు ఏ పార్టీకి అయినా ప్రాణాధారంగా ఉంది. బుజ్జగించి బతిమాలి అయినా వారి సపోర్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు అయితే మొదలెట్టాయి. ఒక విధంగా వారికి గేలం వేస్తున్నాయి. మరి ఇండిపెండెంట్లు కూడా అంత ఈజీగా పడతారా అన్నదే అసలు పాయింట్ గా ఉంది.

ఏకంగా చైర్ కే గురి :

రాజకీయాల్లో ఇలాగే ఉంటుంది. అవకాశం వచ్చినపుడే అందలం ఎక్కాల్సి ఉంటుంది. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు తమ వెంట పడడంతో ఇండిపెండెంట్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. కొంతమంది అయితే తమ దైన కోరికల చిట్టాను విప్పుతున్నారని ప్రచారం సాగుతోంది. మరి కొందరు ముదురు రాజకీయంతో ఏకంగా చైర్మన్ సీటుకే గేలం వేస్తున్నారు అని అంటున్నారు. తమ ఒక్క ఓటుతో చైర్మన్ సీటు దక్కింది అంటే ఆ సీటు తమకే ఎందుకు ఇవ్వకూడదు అన్నది వీరి పొలిటికల్ లాజిక్ గా ఉంది. దీంతో రాయబేరాల కోసం వస్తున్న ప్రధాన రాజకీయ పక్షాల నేతలు ఇండిపెండెంట్ల కోరికలను చూసి షాక్ తింటున్నారు అని అంటున్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన వారు గుర్తు మీద గెలిచిన వారు ఎంతో మంది ఉండగా ఇండిపెండెంట్లకు పీఠం ఎలా అప్పగిస్తామని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

మ్యాజిక్ మార్క్ కోసం :

ఎక్కువ సీట్లు వచ్చాయన్న ఆనందం కాస్తా మ్యాజిక్ మార్క్ కి చేరుకోలేకపోయామన్న బాధ ఆవిరి చేస్తోంది దాంతో ఇండిపెండెంట్ల మద్దతు కోసం వెళ్తే అక్కడ వారు పెట్టే షరతులు రెట్టించే డిమాండ్లతో కీలక రాజకీయ పార్టీలకు పరేషాన్ అవుతోందిట. జనాల తీర్పు అయితే అలా ఉంది. దాంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా మధన పడుతున్నారు. పోనీ ఇండిపెండెంట్లనే తెచ్చి చైర్మన్ పదవి ఇచ్చినా భవిష్యత్తులో వారు పూర్తిగా తమతోనే ఉంటారు అన్న గ్యారంటీ లేదు కదా అన్న ఆలోచన కూడా పట్టి పీడిస్తోందిట. వారు జంప్ అయితే అసలుకే ఎసరు వస్తుంది కదా అని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇపుడు జాతకం అంతా ఇండిపెండెంట్ల చేతిలోకి వెళ్ళడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో చాలా చోట్ల రాజకీయ సీన్ ఉందని అంటున్నారు.

మద్దతు కీలకం

తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అనేక మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందని టాక్. అక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం రాయబారాలు పీక్స్ లో మొదలైపోయాయి అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ల హవాకు ఒక నిట్టనిలువు ఉదాహరణగా చెబుతున్నారు. ఇక్కడ ఏడవ వార్డు కౌన్సిలర్‌ గా ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా అందులో కాంగ్రెస్‌ కి ఎనింది బీఆర్‌ఎస్‌ కి ఏడు, బీజేపీకి మూడు వార్డులు లభించాయి. బీఎస్పీ ఒక వార్డులో గెలిచింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11గా ఉంది. మరి కాంగ్రెస్ కి ముగ్గురు మద్దతు కావాలి. అదే బీఆర్ఎస్ కి నలుగురు కావాలి. దాంతో ఇండిపెండెంట్ మద్దతు అత్యంత కీలకంగా ఉంది. ఈ పరిస్థితులు అనుకూలంగా చేసుకుని సదరు ఇండిపెండెంట్ తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండు పెడుతున్నారని ప్రచారం సాగుతోంది.

అక్కడా అదే సీన్ :

అదే విధంగా జనగామ మున్సిపాలిటీలోనూ ఇండిపెండెంట్ పంట పండుతోంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరి సగం సీట్లు గెలుచుకున్నాయి. ఒకే ఒక సీటు ఇండిపెండెంట్ కి దక్కింది. ఆయన మద్దతుకు రెండు పార్టీలూ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ తనకు చైర్మన్ పదవి ఇస్తే ఎవరికైనా మద్దతుకు ఓకే అంటూ తెగేసి చెప్పడంతో షాక్ తినడం ప్రధాన పార్టీలది అవుతోంది ఇదే రకంగా అనేక మునిసిపాలిటీలలో పరిస్థితి ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.