Begin typing your search above and press return to search.

దీపావళికి మోడీ గుడ్ న్యూస్.. ప్రతీ ఒక్కరికి రూ.15వేలు

దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంది. జాతీయ పతాకంతో ప్రతి వీధి, ప్రతి ఇంటి మురిపెంగా ఎగురుతున్న త్రివర్ణం దేశభక్తి ఉట్టిపడేలా చేసింది.

By:  A.N.Kumar   |   15 Aug 2025 10:58 AM IST
దీపావళికి మోడీ గుడ్ న్యూస్.. ప్రతీ ఒక్కరికి రూ.15వేలు
X

దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంది. జాతీయ పతాకంతో ప్రతి వీధి, ప్రతి ఇంటి మురిపెంగా ఎగురుతున్న త్రివర్ణం దేశభక్తి ఉట్టిపడేలా చేసింది. ఈ ఏడాది "నయా భారత్" అనే థీమ్ తో సమగ్ర అభివృద్ధి , జాతీయ ఏకతకు సంకేతంగా ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది. రాజధానిలో ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ఉత్సాహపూర్వకంగా ప్రసంగించారు. “అసేతు హిమాచలం – వందేమాతరం” నినాదాలతో దేశమంతా మార్మోగుతున్నదని ఆయన గర్వంగా తెలిపారు.

-"ఆపరేషన్ సింధూర్" – దేశ భద్రతకు నిదర్శనం

తన ప్రసంగంలో మోదీ ‘ఆపరేషన్ సింధూర్’ ను ప్రస్తావిస్తూ, దేశ భద్రతకు ముప్పుగా నిలచిన శత్రువులపై భారత సైన్యం అంచనాలను మించిన విజయాన్ని సాధించిందని చెప్పారు. దేశ ప్రజలను రక్షించడంలో రాజీకి తావులేదని, శత్రువు ఎంత బలవంతుడైనా తగిన సమాధానం ఇవ్వగల శక్తి భారత్ కు ఉందని స్పష్టం చేశారు.

- దీపావళి కానుక.. నెక్స్ట్ జెన్ జీఎస్టీ

ఆర్థిక రంగంలో కీలకమైన ప్రకటన చేస్తూ ఈ దీపావళికి నెక్స్ట్-జెన్ జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ ప్రకటించారు. పన్నుల రేట్లను గణనీయంగా తగ్గించి, సాధారణ ప్రజలు , సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) ఇది గొప్ప ఊతమని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా అమలులో ఉన్న జీఎస్టీ సంస్కరణలను పునః సమీక్షించి రాష్ట్రాలతో చర్చించిన తరువాతే ఈ కొత్త మార్పులు తేవబోతున్నామని వెల్లడించారు.

- ఉపాధి సృష్టికి ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ ప్రారంభం

యువత ఉపాధి సమస్యను దృష్టిలో ఉంచుకుని, ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను మోదీ ఆవిష్కరించారు. ₹1 లక్ష కోట్లు నిధులతో ప్రారంభమవుతున్న ఈ పథకం కింద, ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన ప్రతి యువకుడికి కేంద్రం నుంచి ₹15,000 ఆర్థిక సహాయం లభిస్తుంది. సుమారు 3.5 కోట్ల యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది.

- యువతకు మోదీ పిలుపు.. 2047 లక్ష్యాలు

ఆవిష్కరణలకు, సాంకేతిక రంగంలో ముందడుగు వేసే ధైర్యానికి యువత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం యువత ఆలోచనలకు తోడ్పడేలా నిబంధనల్లో మార్పులు చేస్తుందని హామీ ఇచ్చారు. 2047 నాటికి భారత్ ను ప్రపంచ అగ్రగామి దేశంగా నిలపడం యువత భుజస్కందాలపై ఉన్న బాధ్యత అని గుర్తుచేశారు.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జ్ఞాపకాల వేడుకగా కాక "నయా భారత్" దిశగా ముందడుగు వేసే సంస్కరణలు, ఆర్థిక పునరుత్తేజం, ఉపాధి సృష్టి లక్ష్యాలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మువ్వన్నెల పతాకం కింద, అభివృద్ధి యాత్రను కొనసాగించాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోంది.