సోషల్ మీడియాపై ఆదాయపు పన్ను నిఘా
డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.
By: A.N.Kumar | 22 Dec 2025 5:00 PM ISTఇది అసలే సోషల్ మీడియా కాలం.. ఈ సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది తమ విలాసవంతమైన జీవనశైలిని, ఖరీదైన పర్యటనలను ఆన్ లైన్ లో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇవే పోస్టులు ఇప్పుడు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టిని ఆకర్షిస్తన్నాయి.
డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకూ కేవలం బ్యాంకు లావాదేవీలు, ఆస్తి రిజిస్ట్రేషన్లకే పరిమితమైన ఐటీ నిఘా, ఇక పై సోషల్ మీడియా ఖాతాల్లోకి కూడా ప్రవేశించబోతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త అధికారాలతో పన్ను ఎగవేతదారులకు చుక్కలు తప్పవు.
*కొత్త నిబంధనల ఉద్దేశం ఏమిటి
చాలా సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం తక్కువగా చూపిస్తూ.. వాస్తవానికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటార. ఐటీ రిటర్న్స్ లో ఆదాయం రూ.5 లక్షలు అని చూపిస్తూ.. విదేశీ పర్యటనల ఫొటోలు పెట్టడం.. ఖరీదైన కార్లు, బహుమతుల ప్రదర్శన చేయడం.. ఈమెయిల్స్ లేదా క్లౌడ్ స్టోరేజ్ లో దాచిన రహస్య వ్యాపార లావాదేవీలు వీటన్నింటిని అరికట్టి ప్రకటించిన ఆదాయానికి , వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
ఐటీ శాఖకు లభించే విస్తృత అధికారాలు
2026 నుంచి ఆదాయపు పన్ను శాఖాధికారులు వీటిని పరిశీలిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫారమ్ లలోని పోస్టుల గమనిస్తారు. వ్యాపార లావాదేవీలక సంబంధించిన సమాచారం గుర్తిస్తారు. ఆన్ లైన్ లో భద్రపరిచిన ఆస్తి పత్రాలు లేదా డిజిటల్ రికార్డులు గమనిస్తారు. ఆన్ లైన్ ద్వారా జరిగే ఇతర పెట్టబడులు డిజిటల్ ఫుట్ ప్రింట్ లను సేకరిస్తారు.
గోప్యత పరిస్థితి ఏమిటి?
ప్రజల వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం తొంగి చూస్తోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు కొన్ని కీలక వివరణలు ఇచ్చారు. అందరి డేటాను చూడరు. పన్ను ఎగవేతపై బలమైన ఆధారాలు లేదా అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలను ఉపయోగిస్తారు. ఉన్నతాధికారుల అనుమతి, కోర్టు నిబంధనలకు లోబడే ఈ తనిఖీలు జరుగుతాయి. డేటా దుర్వినియోగం కాకుండా పటిష్టమైన అంతర్గత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ఎవరికి ప్రమాదం..? ఎవరికి భయం లేదు?
తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించి బినామీ ఆస్తులు కలిగి ఉండి విదేశాల్లో నివేదించని పెట్టుబడులు ఉన్న వారికి ఈ నిబంధన గండంలా మారనుంది. నిజాయితీగా పన్ను చెల్లించే సామాన్యులకు మధ్యతరగతి ఉద్యోగులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భరోసానిస్తోంది.
ఆర్థిక వ్యవస్థ డిజిటలైజ్ అవుతున్న తరుణంలో పన్ను ఎగవేతదారులు కూడా కొత్తదారులు వెతుకుతున్నారు. వాటిని అడ్డుకోవడానికి ఐటీ శాఖ ‘డిజిటల్ నిఘా’ పెట్టడం అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద 2026 ఏప్రిల్ నుంచి ‘పోస్ట్ చేసే ముందు ఆలోచించండి’ అనే సామెత ఆదాయపు పన్ను విషయంలో కూడా వర్తించనుంది.
