Begin typing your search above and press return to search.

ఐటీ రిటర్నుల గడువు పొడిగించారా? కేంద్రం క్లారిటీ

ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి గడువు సెప్టెంబరు 15 అని, దీనిని సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది.

By:  A.N.Kumar   |   15 Sept 2025 3:26 PM IST
ఐటీ రిటర్నుల గడువు పొడిగించారా? కేంద్రం క్లారిటీ
X

గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల గడువు పొడిగింపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి గడువు సెప్టెంబరు 15 అని, దీనిని సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది.

అధికారిక హెచ్చరిక

ఆదాయపు పన్ను విభాగం ఈ విషయంపై పన్ను చెల్లింపుదారులకు కీలక సూచనలు చేసింది. ఐటీ రిటర్నుల గడువుపై ఎలాంటి తాజా పొడిగింపు లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఎలాంటి జరిమానాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడానికి చివరి అవకాశం సెప్టెంబరు 15వ తేదీ వరకు మాత్రమే.

ఐటీ రిటర్నులకు సంబంధించిన ఏ సమాచారానికైనా ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌, ఎక్స్ ఖాతా లేదా హెల్ప్‌డెస్క్‌ను మాత్రమే నమ్మాలని సూచించింది.

*ఇప్పటివరకు దాఖలైన రిటర్నులు

ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేశారు. వీటిలో 5.51 కోట్ల రిటర్నులు ఇ-వెరిఫై కాగా, 3.78 కోట్ల రిటర్నుల పరిశీలన పూర్తయ్యింది.

* పన్ను చెల్లింపుదారులకు సూచనలు

పన్ను చెల్లింపుదారులు కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ఐటీ విభాగం కోరింది. రూ.3 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో చూసుకొని ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచించింది. తప్పుడు మినహాయింపులు లేదా తప్పుడు రిఫండ్లు కోరడం చట్టవిరుద్ధం. ఇలా చేస్తే భవిష్యత్తులో నోటీసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది.

పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయడానికి 24x7 హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి, ఫేక్ న్యూస్‌ను నమ్మకుండా సెప్టెంబరు 15లోపే తమ రిటర్నులను పూర్తి చేయాలని అధికారులు కోరారు.