Begin typing your search above and press return to search.

ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌’ టర్మ్‌ ప్లాన్‌.. మీ వేతనం ఆగదు

కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన వర్ణనాతీతం.

By:  A.N.Kumar   |   20 Dec 2025 6:00 AM IST
ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌’ టర్మ్‌ ప్లాన్‌.. మీ వేతనం ఆగదు
X

కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన వర్ణనాతీతం. అయితే ఆ వేదనకు తోడు ఆర్థిక కష్టాలు కూడా తోడైతే ఆ కుటుంబం వీధినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆపద సమయంలో ఆదుకోవడానికే ‘టర్మ్ ఇన్సూరెన్స్ ’ పాలసీలు ఉన్నాయి. అయితే బీమా ద్వారా వచ్చే భారీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడం కంటే ప్రతి నెల జీతంలా పొందే వీలుంటే ఎలా ఉంటుంది? అదే ఈ ‘ఇన్ కం రిప్లేస్ మెంట్ టర్మ్ ప్లాన్’. దీని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.

ఒకేసారి వద్దు.. నెలనెలా ముద్దు

సాధారణంగా ఏదైనా టర్మ్ పాలసీలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.50 లక్షలు లేదా రూ.కోటి వంటి పెద్ద మొత్తాన్ని బీ కంపెనీ ఒకేసారి అందిస్తుంది. కానీ అంత పెద్ద మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి. ? ఎక్కడ దాచుకోవాలి? అనే అవగాహన కుటుంబ సభ్యులకు లేకపోతే ఆ డబ్బు వృథా అయ్యే ప్రమాదం ఉంది. తప్పుడు పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా.. కుటుంబానికి ప్రతి నెలా ‘జీతం’ వచ్చేలా చేసేదే ఈ ఆదాయ భర్తీ పథకం.

ఇందులోనూ పలు రకాలున్నాయి..

పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రకాల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. పూర్తినెలవారీ ఆదాయం కోసం బీమా మొత్తాన్ని ఒకేసారి కాకుండా నిర్ణీత కాలం పాటు ప్రతి నెల సమాన వాయిదాల్లో పది నుంచి పదిహేనేళ్ల పాటు చెల్లిస్తారు..

ఇక ఏకమొత్తంతోపాటు నెలవారీ ఆదాయం ప్లాన్ చాలా మందికి ఉపయోగపడే ఆప్షన్. ఇందులో సగం డబ్బును ఒకేసారి ఇస్తారు. దీనిద్వారా అప్పులు ఉంటే తీర్చుకోవచ్చు. మిగిలిన సగాన్ని నెలవారీ ఖర్చుల కోసం పంచుతారు.

ఇక ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఇది ఉత్తమ మార్గం. ఇందులో ప్రతీ ఏటా నెలవారీ వచ్చే ఆదాయం 5 శాతం లేదా 10 శాతం పెరుగుతూ వస్తుంది. ఉదాహరణకు మొదటి ఏడాది రూ.50వేలు వస్తే.. రెండో ఏడాది అది రూ.55 వేలు అవుతుంది. ఇలా పెరుగుకుంటూ పోతుంది.

ఎవరికి ఇది మేలు

భారీ మొత్తంలో నగదును నిర్వహించడం తెలియని వారికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆర్థిక అవగాహన తక్కువ ఉన్న కుటుంబాలకు ఈ పథకం మేలు. ఇక మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసర వస్తువుల ఖర్చుల కోసం నెలనెలా డబ్బు అవసరమయ్యే వారికి ఇది సరైన ఎంపిక. దుబారాను అరికట్టేందుకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే తెలియకుండానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నెలనెలా వస్తే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక జీవితం గడపవచ్చు.

మార్కెట్ ఒడిదుడుకులు, వడ్డీరేట్లతో సంబంధం లేకుండా బీమా కంపెనీ గ్యారెంటీగా ఈ ఆదాయాన్ని అందిస్తుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ ‘ఇన్ కం రిప్లేస్ మెంట్’ ఆప్షన్ ను పరిశీలించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.