మోదీని చూసి నేర్చుకోండిరా ‘పాకీ’లు..
ఇరు పొరుగు దేశాల మధ్య బోర్డర్ దగ్గర తూటాల శబ్దాలు వినిపించడం పాత కథ. కానీ ఇప్పుడు పాకిస్థాన్‌లో సరికొత్త సెటైర్ల వర్షం కురుస్తోంది.
By: A.N.Kumar | 31 July 2026 11:37 AM ISTఇరు పొరుగు దేశాల మధ్య బోర్డర్ దగ్గర తూటాల శబ్దాలు వినిపించడం పాత కథ. కానీ ఇప్పుడు పాకిస్థాన్‌లో సరికొత్త సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ముద్దలు తింటుంటే.. బయట ఆయన సోదరి అలీమా ఖానుమ్ ఇచ్చే "ఉచిత రాజకీయ పాఠాలు" అక్కడి పాలకులకు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. తాజాగా ఆమె సొంత దేశపు పాలకులను ఉద్దేశించి "కాస్త పక్క దేశంలోని మోదీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి రా నాయనా" అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీ హాట్ కేక్‌లా మారింది.
జైలు సీన్... బయట అక్కమ్మ డ్రామా
పాకిస్థాన్‌లో ఎవరైనా నోరెత్తితే చాలు వెనకాలే జీపు వచ్చి నిలబడటం, లోపల వేసి 'ట్రీట్‌మెంట్' ఇవ్వడం అక్కడ కామన్ సీన్. విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే అరెస్టులు, బెదిరింపులు, లాఠీఛార్జీలు వెల్కమ్ చెప్తాయి. ఈ రచ్చనంతా చూసి విసిగిపోయిన అలీమా అక్కమ్మ.. "ప్రజాస్వామ్యం అంటే లాఠీలు ఝళిపించడం కాదు.. కాస్త ప్రజల గొంతు వినడం " అంటూ క్లాస్ పీకారు.
అంతటితో ఆగితే అది పాకిస్థాన్ రాజకీయం ఎందుకవుతుంది? "అదిగో భారత్‌లో చూడండి.. విద్యార్థులు నిరసనలు చేస్తే మోదీ సర్కార్ స్పందిస్తోంది. మనవాళ్ళేమో జైలు తలపులు తెరుస్తున్నారు. కాస్త మోదీని చూసి నేర్చుకోండి" అని బాంబు పేల్చారు. దాంతో పాక్ పాలకులకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయింది.
రచ్చ రంబోలా.. సోషల్ మీడియాలో పండుగ!
అలీమా దెబ్బకు పాకిస్థాన్ అధికార పక్ష నేతలకు ఎక్కడో కాలిపోయింది. "మనల్ని పోయి పోయి భారత్‌తో పోలుస్తుందా? అసలు ఆ మాట అనడానికి ఎంత ధైర్యం?" అంటూ టీవీ డిబేట్లలో మైకులు విరగ్గొడుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ మార్క్ 'పీటీఐ' బ్యాచ్ మాత్రం "అవును మరి. మన పాలకులకు ఆ మాత్రం జ్ఞానం ఉంటే కదా!" అంటూ ఈ కామెంట్లను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా సెటైర్లు:
"పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం అంటే.. మీటర్ లేని ఆటో లాంటిది.. ఎటు పోతుందో ఎవరికీ తెలీదు!" అంటూ నెటిజన్లు అలీమా కామెంట్లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అసలు కథేంటంటే...
భారత్‌లో పేపర్ లీక్‌లు, విద్యా సంబంధిత అంశాలపై విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందించి విచారణలు, సంస్కరణల దిశగా అడుగులు వేసింది.. కానీ పాకిస్థాన్‌లో మాత్రం పరిష్కారాలు ఉండవు, కేవలం ప్రతీకారాలే ఉంటాయి.. అందుకే అలీమా గారు భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ పాక్ పాలకుల చొక్కా పట్టుకుని నిలదీశారు.
ఏది ఏమైనా "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" అనే ఒక్క డైలాగ్‌తో పాకిస్థాన్ రాజకీయాల్లో రచ్చ లేపిన అలీమా ఖానుమ్, అక్కడి పాలకులకు భలే ఉక్కపోత తెప్పించారు. ఈ ఉచిత సలహాని పాక్ పాలకులు సీరియస్‌గా తీసుకుంటారా లేక ఎప్పటిలాగే ఇమ్రాన్ ఖాన్ పక్కన ఆమెకు కూడా రూమ్ బుక్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే..
