భారత్ తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్.. ఇమ్రాన్ సోదరి సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 3 Dec 2025 4:16 PM ISTపాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం కోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తహతహలాడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో తన సోదరుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ పొరుగుదేశంతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకున్నట్లు గుర్తు చేశారు. ఇమ్రాన్ తో ములాఖత్ కు అనుమతి లభించిన నేపథ్యంలో అలీమా ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్ మునీరును ఇస్లామిక్ ఛాందసవాదిగా అభివర్ణించారు.
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భారత్ తో యుద్ధాన్ని కోరుకుంటున్నట్లు అలీమా ఆరోపించారు. తన సోదరుడు ఇమ్రాన్ స్వేచ్ఛావాది అంటూ చెప్పారు. ఈ ఏడాది మే నెలలో భారత్-పాక్ మధ్య యుద్ధానికి గల కారణాలపై ఆమెను ప్రశ్నించగా, ఆర్మీ చీఫ్ మునీర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసిమ్ మునీర్ ఇస్లామిక్ ఛాందసవాది. అందుకే అతడు భారత్ లో యుద్ధం కోసం ఆరాటపడుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలకు ప్రయత్నాలు చేశారని తెలిపారు.
సందర్భం వచ్చినప్పుడల్లా ఆసిమ్ మునీర్ భారత్ తో ఘర్షణలకు దిగుతాడు. ఇది భారత్ తోపాటు దాని మిత్రదేశాలకు కూడా నష్టమే అని ఆమె అన్నారు. ఇటీవల కాలంలో పాక్ లో అంతర్గత సమస్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ను జైలులో హత్య చేశారంటూ విస్తృత ప్రచారం సాగింది. దీంతో ఆయన బంధువులు, పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఇద్దరు సోదరీమణులతోపాటు కొద్ది మంది పార్టీ నేతలకు ఆయనతో మిలాఖత్ కు ప్రభుత్వం అంగీకరించింది.
ఈ నేపథ్యంలో అలీమాతోపాటు మరోసోదరి ఉజ్మా ఖానుమ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ను మంగళవారం జైలులో కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ జైలులో సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. అయితే మాజీ ప్రధానిని మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తాను జైలు శిక్ష అనుభవించడానికి ఆర్మీ చీఫ్ మునీర్ కారణమని ఇమ్రాన్ తమతో చెప్పినట్లు ఉజ్మా వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
