Begin typing your search above and press return to search.

ఖాన్ ఆరోగ్యంతో ప్రభుత్వం జూదం... పీటీఐ సంచలన ఆరోపణలు!

అవును... మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

By:  Raja Ch   |   28 Jan 2026 12:08 PM IST
ఖాన్  ఆరోగ్యంతో ప్రభుత్వం జూదం... పీటీఐ సంచలన ఆరోపణలు!
X

ఆగస్టు 2023 నుంచి జైల్లోనే మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కు గత ఏడాది డిసెంబర్ లో మరో బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తోషాఖానా-2 అవినీతి కేసులో పాకిస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీలకు చెరో 17 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో తాజాగా ఇమ్రాన్ ఖాన్ శాస్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణ చికిత్స లేని పక్షంలో.. శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఖాన్ కుడి కంటిలో సెంట్రల్ రెటీనా సిర మూసుకుపోయినట్లు నిర్ధారణ అయిందని మీడియా నివేదికలు సూచించాయని పార్టీ తెలిపింది. ఈ పరిస్థితిలో రెటీనా సిరలో అడ్డంకి ఏర్పడి, వెంటనే చికిత్స చేయకపోతే తీవ్రమైన, శాశ్వత నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో... వైద్య సలహా ఉన్నప్పటికీ, జైలు అధికారులు అడియాలా జైలులోనే ఇమ్రాన్ ఖాన్‌ కు చికిత్స చేయాలని పట్టుబడుతున్నారని.. సరైన సంరక్షణకు ఆపరేషన్ థియేటర్ తో పాటు జైలులో అందుబాటులో లేని ప్రత్యేక సౌకర్యాలు అవసరమని నిపుణులు చెప్పారని పీటీఐ తెలిపింది. ఈ సమయంలో.. ఇమ్రాన్ ఖాన్ ను చికిత్స కోసం తనకు నచ్చిన ఆసుపత్రికి తరలించాలని.. అతని కుటుంబం, సన్నిహితులతో స్వేచ్ఛగా కలవడానికి అనుమతించాలని పీటీఐ కోరింది.

అదేవిధంగా... ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా అక్టోబర్ 2024లో తన వ్యక్తిగత వైద్యుడిని కలిశారని.. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అప్పటి నుండి ఎటువంటి వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వలేదని.. ఇది కోర్టు ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించడంతోపాటు ప్రాథమిక మానవ హక్కులకు స్పష్టంగా భంగం కలిగించడమేనని తెలిపింది. ఇదే సమయంలో... క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఆగస్టు 2025 నుండి పెండింగ్‌ లోనే ఉందని వెల్లడించింది.

ఇదే క్రమంలో.. రాజకీయ ప్రతీకారంతో ఖాన్ జీవితాన్ని జైలులోనే ముగించేలా ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆరోగ్యంతో జూదం ఆడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పీటీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఈ సమయంలో.. ఆయన పరిస్థితి గురించి ప్రజలకు భరోసా ఇవ్వడం అవసరమని.. నిపుణుల చికిత్స కోసం ఆయనను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి లేదా మరొక ఆసుపత్రికి పంపించాలని డిమాండ్ చేసింది.