Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి డ్రామా : ఆర్మీ కరుణించింది.. ఆస్పత్రికి పంపింది.. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ కు ఊపిరి..

తాజాగా మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి అర్ధరాత్రి వేళ ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.

By:  A.N.Kumar   |   21 Aug 2026 11:52 AM IST
అర్ధరాత్రి డ్రామా : ఆర్మీ కరుణించింది.. ఆస్పత్రికి పంపింది.. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ కు ఊపిరి..
X

పాకిస్తాన్ రాజకీయాల్లో ఉత్కంఠ, ట్విస్టులు, హైడ్రామా ఏమాత్రం తక్కువ కావు. తాజాగా మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి అర్ధరాత్రి వేళ ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. 2023 ఆగస్ట్ నుండి అడియాలా జైలు గోడలకే పరిమితమైన 73 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్.. రాజకీయ నాయకుడు.. దాదాపు 1,111 రోజుల సుదీర్ఘ ఖైదు తర్వాత బయటి గాలి పీల్చుకోవడం ఇదే తొలిసారి. అయితే ఇది పర్యటన అనుకుంటే పొరపాటే.. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో జరిగిన ఈ హాస్పిటల్ షిఫ్టింగ్ వెనుక అపూర్వమైన భద్రతా విన్యాసాలు జరిగాయి.

ఆసుపత్రా? లేక సరికొత్త సైనిక స్థావరమా?

మాజీ ప్రధానికి వైద్యం అందిస్తున్నారంటే ఆసుపత్రికి తెచ్చారు సరే.. కానీ ప్రభుత్వాధికారుల భయం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒక్కటి బయటకు వచ్చినా.. తమ రాజకీయ సమీకరణాలు ఎక్కడ మారతాయో అన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆసుపత్రిలోని ఏ-4, ఈ-4 ఫ్లోర్లను ఏకంగా తాత్కాలిక "సబ్ జైల్"గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండు ఫ్లోర్లను ఇస్లామాబాద్ పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అక్కడితో ఆగకుండా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దాదాపు 830 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించి రౌండ్ ది క్లాక్ నిఘా ఉంచారు. సాధారణంగా వైద్యులు రోగుల వద్దకు ఫోన్లు పట్టుకుని సమాచారం లేదా అప్‌డేట్స్ పంచుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఈ ప్రత్యేక సెక్యూరిటీ జోన్‌లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా మొబైల్ ఫోన్లు వాడే వెసులుబాటు లేకపోవడం విశేషం. దానికి తోడు వార్డుల పరిసరాల్లో హై-పవర్ సిగ్నల్ జామర్లు ఏర్పాటు చేసి ఆసుపత్రి వైపు వచ్చే ప్రధాన రహదారులను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కంటే ఆయన ఫొటోలు, వీడియోలు బయటకు వస్తాయేమోననే ఎక్కువ భయపడుతోందని విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.

వైద్యం కంటే ఆంక్షల పర్యవేక్షణే ఎక్కువ

ఇమ్రాన్ ఖాన్ హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, తీవ్రమైన కంటి చూపు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు కేవలం 15 శాతానికి మాత్రమే పడిపోయిందని కుటుంబ సభ్యులు, పీటీఐ ప్రతినిధులు, న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన వాతావరణం చూస్తుంటే "వైద్యం కంటే ఆంక్షల పర్యవేక్షణే ఎక్కువ" అనే భావన కలుగుతోంది.

2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు కాలం కలసిరావడం లేదు. తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ శ్రేణులు గొంతు చించుకుంటున్నా బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా ఇప్పటివరకు సఫలం కాలేదు.

ఏది ఏమైనా పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక నాయకుడు జైలులో ఉన్నా లేదా ఆసుపత్రి పాలైనా.. అక్కడి నిబంధనలు మాత్రం అధికారుల భయానికి, భద్రతా ఆందోళనలకు అనుగుణంగానే మారాల్సి వస్తుండటం గమనార్హం.